AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏఐ, క్వాంటం రంగాల్లో 7 కీలక ఒప్పందాలు..!

ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్తు టెక్నాలజీ రంగంలో ఛాంపియన్‌గా నిలిపేలా రాష్ట్ర ప్రభుత్వం తన వ్యూహాలకు పదును పెట్టింది. అమరావతిని క్వాంటం వ్యాలీగా అభివృద్ధి చేసే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ క్రమంలో ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఇండియా-ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వేదికగా ఏపీ ప్రభుత్వం ఏడు కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఐబీఎం సహా పలు అంతర్జాతీయ సంస్థలతో ఈ ఎంఓయూలు జరిగాయి. ఏపీని ఏఐ-క్వాంటం హబ్‌గా మార్చడం, యువతకు శిక్షణ ఇవ్వడం, ప్రభుత్వ సేవల్లో టెక్నాలజీని వాడటమే ఈ ఒప్పందాల ప్రధాన ఉద్దేశం.

 

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు

క్వాంటం, ఏఐ విభాగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసేందుకు యూనైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ (UNICC)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో ఈ ఏడాది చివరి నాటికి ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది ఏఐ-క్వాంటం డిజిటల్ ఎంబసీగా పనిచేస్తుంది. యూఎన్ఐసీసీ డైరెక్టర్ సమీర్ చౌహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

లక్ష మంది యువతకు ఐబీఎం శిక్షణ

క్వాంటం, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో రాష్ట్రంలోని 1 లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఐబీఎంతో ఎంఓయూ చేసుకుంది. ఐబీఎం గ్లోబల్ డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ ఫాం ద్వారా ఐటీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేలా ఐబీఎం అంగీకరించింది. భారత్ లో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్ వర్క్ ఫోర్సును సిద్ధం చేసుకునే లక్ష్యాల్లో భాగంగా ఐబీఎం శిక్షణా కార్యక్రమాన్ని రూపందించింది. ఒప్పందం కార్యక్రమానికి ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్, ఆ సంస్థ దక్షిణాసియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాలాజీ, ఐబీఎం రీసెర్చ్ లాబ్స్ డైరెక్టర్ అమిత్ సింఘీ తదితరులు హాజరయ్యారు.

 

ఏఐ & క్వాంటం డీమ్డ్ యూనివర్సిటీ

ఏపీలో క్వాంటం ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుపై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ-NIELITతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దక్షిణ భారతదేశంలో మొట్ట మొదటి ఏఐ, క్వాంటం డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌‌ను ఏర్పాటు చేసేలా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ప్రణాళిక రూపొందించింది. మౌలిక సదుపాయాలకు కేంద్రం నిధులు కల్పించనుంది. అలాగే భూమి, క్వాంటం హార్డ్‌వేర్ ను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ లో నేషనల్ హబ్ గా తీర్చిదిద్దేలా కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమంలో NIELIT డైరెక్టర్ జనరల్ డాక్టర్ మదన్ మోహన్ త్రిపాఠి, కంట్రోలర్ జనరల్ డాక్టర్ అలోక్ త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.

 

స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మాణం

రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్, 5 లేయర్డ్ స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మించేలా భారత్ జెన్, నెక్స్ జెన్, ఐబీఎంతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ సంస్థలకు సేవలు అందించడంతో పాటు 22 భారతీయ భాషలను అనుసంధానించేలా ఒక ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేయనున్నారు.

 

ఏఐ అకాడెమీ & ఏఐ శాండ్ బాక్స్

ఏపీలోని 50 ఉన్నతవిద్యా సంస్థల్లో ఏఐ, క్వాంటం టెక్నాలజీని బలోపేతం చేసేలా ఏఐ అకాడెమీ, ఏఐ శాండ్ బాక్స్ ఏర్పాటు చేసేందుకు కాలిబో ఏఐ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గ్రాడ్యుయేట్లు, పీజీ విద్యార్థులకు అవగాహన కల్పించడం, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కోసం ఏఐ శాండ్ బాక్స్-ఇన్నోవేషన్ ల్యాబ్స్ ఏర్పాటు చేసేలా ఎంఓయూ చేసుకున్నారు. ఏఐ ఇంటిగ్రేటెడ్ కరిక్యులమ్, నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై ఫోకస్ పెట్టేలా కాలిబో సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం కుదుర్చుకుంది. ఈ ఎంఓయూ కార్యక్రమంలో రాజ్ వట్టికూటి, అరబిందో సాహూ, విపుల్ వలంజీ, పింటో జోయ్సన్, జోహన్నెస్ ష్రోడర్ తదితరులు పాల్గొన్నారు.

 

భారీ ఎత్తున నైపుణ్య లబ్ధిదారులు

అమరావతి క్వాంటం వ్యాలీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు వైజర్ (Vaisar) సంస్థతో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా 2026 చివరి నాటికి 3.50 లక్షల మందిని, 2027 నాటికి 6 లక్షల మందిని ఏఐ-క్వాంటం నిపుణులుగా సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

ఐఐటీ మద్రాస్ సహకారంతో ‘ఏఐ ట్యూటర్’

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ను అందుబాటులోకి తీసుకువచ్చేలా ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం కుదిరింది. దీనివల్ల విద్యార్థులకు టెక్నాలజీ సాయంతో పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయి. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ANN TOP 10