మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తిని నింపాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తన అధికారాన్ని, నిధులను విచ్చలవిడిగా ఉపయోగించినప్పటికీ ఆశించిన స్థాయిలో స్థానాలు సాధించలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేవలం 4 మున్సిపాలిటీలకే పరిమితమైందని గుర్తు చేస్తూ, ప్రస్తుతం తాము 17 మున్సిపాలిటీల్లో విజయం సాధించడం తమ కార్యకర్తల పోరాట పటిమకు నిదర్శనమని కొనియాడారు. హంగ్ ఏర్పడిన చోట్ల కూడా మేయర్, ఛైర్మన్ పీఠాలను దక్కించుకునే అవకాశం బీఆర్ఎస్‌కే ఉందని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ.. ఆ పార్టీకి హడావిడి ఎక్కువ, ఫలితాలు తక్కువ అని కేటీఆర్ మండిపడ్డారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చి ప్రచారం చేసినా ఒక్క మున్సిపాలిటీని కూడా గెలవలేకపోయారని, గతంతో పోలిస్తే వారికి ఓట్లు, వార్డులు తగ్గాయని విశ్లేషించారు. అలాగే మేయర్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓట్ల నిబంధనలపై ప్రభుత్వానికి కనీస అవగాహన లేదని, కలెక్టర్లు మరియు ఉన్నతాధికారులు పరస్పర విరుద్ధ ప్రకటనలతో గందరగోళం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. అడ్డదారుల్లో మున్సిపల్ పీఠాలను దక్కించుకోవాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన ఆరోపించారు.
చివరగా ఫార్ములా-ఈ రేసు కేసు విచారణపై కేటీఆర్ స్పందిస్తూ.. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని కొట్టిపారేశారు. ఇప్పటికే నాలుగుసార్లు విచారణ చేసినా ఏమీ నిరూపించలేకపోయారని, ఇప్పుడు మళ్ళీ నోటీసులు ఇవ్వడం ఒక ‘తమాషా’ అని విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, చివరికి జైలుకు పంపినా తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కేవలం ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇలాంటి విచారణలను తెరపైకి తెస్తున్నారని ఆయన మండిపడ్డారు.








