ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు తీపి కబురు అందించింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దివ్యాంగుల కోసం ‘ఇంద్రధనస్సు’ అనే సరికొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ ఏపీఆర్టీసీ (APRTC) బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. ప్రస్తుతం వీరు 50 శాతం రాయితీతో ప్రయాణిస్తుండగా, తాజా నిర్ణయంతో మహిళల తరహాలోనే దివ్యాంగులకు కూడా పూర్తి ఉచిత సౌకర్యం లభించనుంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండు లక్షల మందికి పైగా దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని బడ్జెట్‌లో చేర్చారు. గత లెక్కల ప్రకారం దివ్యాంగుల రాయితీ కోసం ప్రభుత్వం ఏటా రూ. 180 కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పుడు ఈ పథకం అమలుతో దివ్యాంగులైన పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ వెసులుబాటు కలుగుతుంది. అయితే, ఈ పథకం ఖచ్చితంగా ఏ తేదీ నుండి ప్రారంభమవుతుందనే దానిపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయనుంది. దీనిపై దివ్యాంగుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ. 3,32,205 కోట్లతో భారీ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లుగా ఉండగా, మూలధన వ్యయానికి రూ. 53,915 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం కారణంగా పాత అప్పులు తీర్చడానికే కొత్త అప్పులు చేయాల్సి వస్తోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యాల నుంచి వెనక్కి తగ్గేది లేదని, ఈ బడ్జెట్ రాష్ట్ర పునర్నిర్మాణానికి నాంది పలుకుతుందని ఆయన స్పష్టం చేశారు.








