AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

“ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది”: బీఆర్ఎస్ నేతలకు కవిత స్ట్రాంగ్ వార్నింగ్!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం జూబ్లీహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ (BRS) పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతోందని ప్రకటించినప్పటి నుండి తమను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. “మమ్మల్ని విమర్శించే వారికి ఒకటే చెబుతున్నాను.. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది” అని ఆమె హెచ్చరించారు. గతంలో 90 శాతం మున్సిపాలిటీలను ఏలిన బీఆర్ఎస్, ఇప్పుడు కేవలం 16-17 స్థానాలకే పరిమితమవ్వడంపై ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

మున్సిపల్ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) తో కలిసి తెలంగాణ జాగృతి అద్భుత ప్రతిభ కనబరిచిందని కవిత వెల్లడించారు. అధికారికంగా 33 స్థానాల్లో తమ అభ్యర్థులు గెలవగా, మరో 7 చోట్ల సాంకేతిక కారణాల వల్ల స్వతంత్రులుగా గెలిచిన వారు కూడా తమ వారేనని, మొత్తంగా 40 వార్డులను కైవసం చేసుకున్నామని ఆమె ప్రకటించారు. ముఖ్యంగా వడ్డేపల్లి మున్సిపాలిటీలో తమ కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చిందని స్పష్టం చేశారు. ఏఐఎఫ్‌బీ రాష్ట్ర కార్యదర్శి అంబటి బోజిరెడ్డితో కలిసి ఆమె ఈ సమావేశంలో పాల్గొని, తమ మధ్య ఉన్న పొత్తును మరోసారి ధృవీకరించారు.

బీఆర్ఎస్ మరియు బీజేపీల మధ్య పొత్తుకు ఈ ఎన్నికలే పునాది అని కవిత సంచలన ఆరోపణ చేశారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ పరోక్షంగా సహకరించిందని ఆమె విమర్శించారు. అలాగే కాంగ్రెస్‌తో చేతులు కలిపిన సీపీఐకి కొత్తగూడెంలో బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తి లేకపోవడం వల్లే ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారని, ఆ రాజకీయ లోటును భవిష్యత్తులో తెలంగాణ జాగృతి భర్తీ చేస్తుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తమ రాజకీయ ప్రయాణం మరింత ఉధృతంగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

ANN TOP 10