ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకాళహస్తి క్షేత్రంలో నూతనంగా నిర్మించిన గిరి ప్రదక్షిణ రోడ్డును శుక్రవారం ఉదయం వెలగపూడి సచివాలయం నుండి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమిళనాడులోని అరుణాచలం తరహాలోనే శ్రీకాళహస్తిలో కూడా గిరి ప్రదక్షిణ చేయాలని తనకు ఎంతో కోరికగా ఉందని, త్వరలోనే స్వామివారిని దర్శించుకుంటానని తెలిపారు. సుమారు రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ మార్గం భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని, ముఖ్యంగా శివరాత్రి పర్వదినానికి రెండు రోజుల ముందు దీనిని ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
దేవాలయాల పరిరక్షణపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, ఆలయ పాలక మండళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తేనే అపచారాలు జరగకుండా ఉంటాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలను గుర్తుచేస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం దేవాలయాల పవిత్రతను కాపాడటంలో రాజీ పడదని పేర్కొన్నారు. 22 కిలోమీటర్ల మేర ఉన్న ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు శివరాత్రి బ్రహ్మోత్సవాల తర్వాత అటవీ శాఖ ఆధ్వర్యంలో మార్గం ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
శ్రీకాళహస్తితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 22 ప్రధాన దేవాలయాల అభివృద్ధికి రూ. 40 కోట్లు వెచ్చించి రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఇందులో భాగంగా ఏలూరు జిల్లా జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఘాట్ రోడ్డుకు రూ. 3.70 కోట్లు, కోటప్పకొండ పరిసర ప్రాంతాలకు రూ. 4 కోట్లు, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ. 6 కోట్లు కేటాయించినట్లు వివరించారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, పౌర్ణమి రోజుల్లో కైలాసగిరి ప్రదక్షిణను ప్రత్యేకంగా నిర్వహించాలని ఆలయ నూతన ట్రస్ట్ బోర్డుకు ఆయన సూచించారు.








