ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) థియరీ పరీక్షల కోసం హాల్ టికెట్లను అధికారికంగా విడుదల చేసింది. ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం 11 గంటల నుంచి వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ లింక్ అందుబాటులోకి వచ్చింది. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షలకు హాజరయ్యే దాదాపు 10.57 లక్షల మంది విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను ఆన్‌లైన్ ద్వారా లేదా తమ కళాశాలల నుంచి పొందవచ్చు.
విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.in ను సందర్శించాలి. అక్కడ ‘IPE February 2026 Theory Hall Tickets’ లింక్‌పై క్లిక్ చేసి, తమ వివరాలను నమోదు చేయాలి. ఫస్ట్ ఇయర్ విద్యార్థులు తమ పదో తరగతి హాల్ టికెట్ నంబర్ లేదా ఆధార్ నంబర్, పుట్టిన తేదీని ఉపయోగించాలి. సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రోల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ద్వారా హాల్ టికెట్ పొందవచ్చు. అదనంగా, ప్రభుత్వం ‘మన మిత్ర’ వాట్సాప్ సర్వీస్ (9552300009) ద్వారా కూడా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది.
పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే విద్యార్థులు తమ హాల్ టికెట్‌పై ఉన్న పేరు, ఫోటో, సంతకం, పరీక్షా కేంద్రం కోడ్ మరియు సబ్జెక్టుల వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలి. ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి సరిదిద్దుకోవాలి. హాల్ టికెట్ లేకుండా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉండదు కాబట్టి, ముందే ప్రింట్ తీసుకుని జాగ్రత్త చేసుకోవాలని బోర్డు సూచించింది. ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు ఇప్పటికే ముందే విడుదలైన విషయం తెలిసిందే.








