ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర ప్రగతి నివేదికను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి పేదల ఆకలి తీరుస్తున్నామని, గత ప్రభుత్వం వీటిని రద్దు చేసి పేదవాడి కడుపు కొట్టిందని ఆయన విమర్శించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల కోసం మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేశామని, అలాగే 5,757 కానిస్టేబుల్ పోస్టులను కూడా భర్తీ చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 23 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో ఏపీ రూపురేఖలు మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో శ్మశానం అని విమర్శలకు గురైన అమరావతిని వచ్చే మూడేళ్లలో దేశంలోనే ‘మోస్ట్ లివబుల్ సిటీ’గా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
నీటి పారుదల రంగంపై మాట్లాడుతూ, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైందని, దాని పునర్నిర్మాణానికి ఇప్పుడు అదనంగా రూ.1000 కోట్లు ఖర్చవుతోందని మండిపడ్డారు. అయినప్పటికీ, 2027 పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. భూ అక్రమాలకు తావులేకుండా క్యూఆర్ కోడ్, రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలను అందిస్తున్నామని, స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని అధికారులకు దిశానిర్దేశం చేశారు.









