AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బెంగాల్ ఓటర్ల జాబితా వివాదం: మమతా బెనర్జీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఓటర్ల జాబితా నుంచి దాదాపు 1.36 కోట్ల మంది పేర్లను చిన్న చిన్న కారణాలతో తొలగించారని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మైక్రో-అబ్జర్వర్లుగా నియమించడం రాజ్యాంగ విరుద్ధమని దీదీ వాదించారు. అయితే, ఈ ప్రక్రియకు ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఏవైనా స్పష్టతలు కావాలంటే ఇస్తాం కానీ, ఎస్ఐఆర్ ప్రక్రియను ఆపడాన్ని అనుమతించబోమని కోర్టు తేల్చిచెప్పింది.

విచారణ సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ (ECI) తన వాదనలను వినిపిస్తూ.. మైక్రో-అబ్జర్వర్ల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఐదుసార్లు లేఖలు రాసినా స్పందన లేకపోవడంతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను నియమించాల్సి వచ్చిందని కోర్టుకు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పేర్లను సమర్పించడంలో జాప్యం చేసిందని ఈసీ ఆరోపించింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు, ఫిబ్రవరి 4నే ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఫిబ్రవరి 7 వరకు అధికారుల జాబితాను పంపడంలో ఎందుకు జాప్యం జరిగిందని బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీసింది. 8,000 మందికి పైగా గ్రూప్-బి అధికారుల వివరాలను సకాలంలో అందజేయకపోవడంపై సీజేఐ అసహనం వ్యక్తం చేశారు.

మమతా బెనర్జీ స్వయంగా కోర్టుకు హాజరై తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. మైక్రో-అబ్జర్వర్లుగా ఉన్న కేంద్ర ఉద్యోగులు ఎటువంటి అధికారం లేకుండా అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారని ఆమె ఆరోపించారు. అయితే, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడమే ముఖ్యమని భావించిన ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎన్నికల కమిషన్ మధ్య సమన్వయం ఉండాలని సూచించింది. ఓటర్ల జాబితా సవరణ అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఘట్టమని, దీన్ని అడ్డుకోవడం సరికాదని పేర్కొంటూ తదుపరి ఆదేశాలను జారీ చేస్తామని తెలిపింది.

ANN TOP 10