AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కుక్కల గురించి మాట్లాడతారు, గిరిజన పిల్లల గురించి మాట్లాడరా?.. రేణూ దేశాయ్‌పై ఆరె శ్యామల పరోక్ష సెటైర్లు!

దేవరపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. వీధి కుక్కల సంరక్షణ గురించి గొంతు ఎత్తుతున్న సెలబ్రిటీలు, అస్వస్థతకు గురవుతున్న గిరిజన బిడ్డల గురించి ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ఇటీవల కుక్కల సంరక్షణపై గట్టిగా మాట్లాడుతున్న నటి రేణూ దేశాయ్‌ను ఉద్దేశించినవేనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

పోలవరం జిల్లా దేవరపల్లి పాఠశాలలో ఉడకని ఇడ్లీలు, నిల్వ ఉన్న చట్నీ తిని 89 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనను ప్రస్తావిస్తూ శ్యామల తన ట్వీట్‌లో విమర్శలు గుప్పించారు. రంపచోడవరం ఆస్పత్రిలో ఒకే మంచంపై నలుగురైదుగురికి సెలైన్లు ఎక్కించే దౌర్భాగ్య స్థితి ఉందని, కూటమి ప్రభుత్వం వచ్చాక సరైన ఆహారం, వైద్యం అందక అనేకమంది గిరిజన విద్యార్థులు మరణిస్తున్నా మీడియాలో చర్చలు జరగడం లేదని ఆమె ఆరోపించారు. కుక్కల సంరక్షణపై మాట్లాడే మేధావులు ఈ ప్రాణాల గురించి ఎందుకు మాట్లాడరని నిలదీశారు.

మరోవైపు, దేవరపల్లి ఘటనపై ప్రభుత్వం స్పందిస్తూ స్కూల్ వార్డెన్, వంట మనిషిని ఇప్పటికే సస్పెండ్ చేసింది. గడువు ముగిసిన ఇడ్లీ రవ్వ, శనగపిండి వాడటం వల్లే ఈ అస్వస్థత జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంపై సీరియస్ అయ్యి, అధికారుల నుంచి నివేదిక కోరారు. అయితే, శ్యామల చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సెలబ్రిటీల సామాజిక బాధ్యతపై కొత్త చర్చకు దారితీసింది.

ANN TOP 10