AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నడిరోడ్డుపై ఆప్ నేత లక్కీ ఒబెరాయ్ హత్య: జలంధర్‌లో పట్టపగలే కాల్పుల కలకలం

పంజాబ్‌లో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నార్థకం చేస్తూ జలంధర్‌లో శుక్రవారం ఉదయం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత లక్కీ ఒబెరాయ్ జలంధర్ మోడల్ టౌన్‌లోని గురుద్వారాకు చేరుకుని, బయట తన మహీంద్రా థార్ కారును పార్క్ చేస్తుండగా గుర్తుతెలియని దుండగులు మెరుపుదాడి చేశారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు కారు వద్దకు వచ్చి, లోపల ఉన్న ఒబెరాయ్‌పై ఏకంగా ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. బుల్లెట్లు నేరుగా శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఈ మొత్తం ఉదంతం సమీపంలోని సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డయ్యింది. నిందితుడు నలుపు రంగు హుడీ ధరించి, ముఖానికి మాస్క్ పెట్టుకుని వచ్చి కాల్పులు జరిపినట్లు దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కాల్పుల ధాటికి కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటన జరిగిన వెంటనే నిందితులు బైక్‌పై పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందా లేక రాజకీయ కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

అధికార పార్టీ నేతకే రక్షణ లేకపోవడంతో భగవంత్ మాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా మరియు శిరోమణి అకాళీదల్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ స్పందిస్తూ.. పంజాబ్‌లో నేరస్థులు బరితెగించారని, సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం కేవలం ప్రచారాలకే పరిమితమైందని, శాంతిభద్రతలను గాలికొదిలేసిందని విమర్శించారు.

ANN TOP 10