తెలంగాణ జాగృతి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఘాటుగా విమర్శించారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తాము ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని గుర్తు చేశారు. అయితే, ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ వేసిన బుట్టంగారి మాధవరెడ్డికి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం ద్వారా ఆ పార్టీ తన అసలు రంగును బయటపెట్టుకుందని ఆమె మండిపడ్డారు. బీసీల నోటికాడి బుక్కను లాక్కునే ప్రయత్నం చేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం అంటే, ఆ పార్టీకి బీసీలపై ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.
హరీష్ రావుపై కూడా కవిత నేరుగా విమర్శలు సంధించారు. మాధవరెడ్డి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడని, ఆయన పర్సనల్ లాయరే ఈ కేసు వేయించారని ఆరోపించారు. దీని వెనుక ఉన్నది హరీష్ రావు మాత్రమేనని, ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వడం ద్వారా దీని వెనుక మొత్తం బీఆర్ఎస్ ఉన్నట్లు స్పష్టమైందన్నారు. బీసీల జనగణన విషయంలో కూడా బీఆర్ఎస్ ముందు ప్రజలను తప్పుదోవ పట్టించిందని ధ్వజమెత్తారు. బీసీలంతా ఈ విషయాన్ని గమనించి మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ పార్టీ వైఖరిని కూడా కవిత తప్పుబట్టారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలపై వేటు వేయకుండా, వారికే ఎన్నికల ఇన్ఛార్జ్ పదవులు కట్టబెట్టడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరగడం కాదని, పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఎన్నికల్లో జాగృతి తరపున కొందరు ‘సింహం’ గుర్తుపై పోటీ చేస్తున్నారని, ప్రశ్నించే గొంతుకలైన స్వతంత్ర అభ్యర్థులను, సీపీఎం, న్యూ డెమాక్రసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అలాగే, ఈ నెల 12న నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభకు అందరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు.









