ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందన్న వార్తలను జాతీయ మహిళా కమిషన్ (NCW) కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించిన కమిషన్, వాస్తవాలను తెలుసుకునేందుకు ఒక విచారణ బృందాన్ని ములుగు జిల్లాకు పంపింది. ప్రాథమిక విచారణ అనంతరం, జాతరలో అలాంటి దురదృష్టకర సంఘటన ఏదీ చోటుచేసుకోలేదని కమిటీ స్పష్టం చేసింది.
ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలు డెలినా ఖోంగ్‌దుప్ నేతృత్వంలోని బృందం గురువారం ములుగు జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర, ఎస్పీ రామ్‌నాథ్ కేకన్‌లతో సమావేశమై వివరాలు సేకరించింది. అనంతరం ఘటనా స్థలంగా ప్రచారమైన ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించింది. 13 ఏళ్ల బాలికపై ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారన్న వార్తల్లో నిజం లేదని అధికారులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ మొత్తం వ్యవహారంపై పోలీసుల నుంచి పూర్తిస్థాయి లిఖితపూర్వక నివేదిక అందిన తర్వాత, కమిటీ తన తుది నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ఈ ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగిన మేడారం జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. తప్పుడు వార్తలతో భక్తులలో ఆందోళన కలిగించవద్దని ఈ సందర్భంగా అధికారులు విజ్ఞప్తి చేశారు.








