వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం (ఫిబ్రవరి 6, 2026) విజయవాడ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇబ్రహీంపట్నంలో ఇటీవల దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించాలని జగన్ నిర్ణయించుకున్నారు. అయితే, భద్రతా కారణాలు మరియు ట్రాఫిక్ సమస్యలను సాకుగా చూపుతూ విజయవాడ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు.
వాస్తవానికి, తాడేపల్లి నివాసం నుంచి కనకదుర్గ వారధి, ఫ్లైఓవర్ మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లేలా వైసీపీ శ్రేణులు ముందుగానే రూట్ మ్యాప్‌ను పోలీసులకు అందజేశాయి. కానీ, పర్యటనకు కొన్ని గంటల ముందు విజయవాడ పోలీస్ కమిషనర్ ఆ మార్గంలో వెళ్లవద్దని, వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. ఉదయం వేళల్లో నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని, కాన్వాయ్ వల్ల వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
పోలీసుల తీరుపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు పర్యటనకు వచ్చిన భారీ జనస్పందన చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోందని, అందుకే కుట్రపూరితంగా ఆంక్షలు విధిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. “ముందే సమాచారం ఇచ్చినా చివరి నిమిషంలో నోటీసులు ఇవ్వడం పర్యటనను అడ్డుకోవడమే” అని వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జగన్ పర్యటన ఏ మార్గంలో సాగుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.








