తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యికి బదులుగా కల్తీ పామాయిల్ ఉపయోగించారని, ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదని, చాలా కాలం క్రితమే జరిగిన కుట్ర అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. వైసీపీ నేతలకు ఏడుకొండల స్వామిపై నమ్మకం లేదని, అందుకే మన ధర్మాన్ని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమలలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అపచారాలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా బుకాయిస్తున్నారని, ఈ విషయాన్ని తాము అంత తేలికగా వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు.
2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలోని అనేక దేవాలయాలపై దాడులు జరిగాయని, విగ్రహాలను ధ్వంసం చేసినా అప్పటి ప్రభుత్వం పిచ్చోళ్లు చేసిన పనిగా కొట్టిపారేసిందని పవన్ విమర్శించారు. లడ్డూ కల్తీపై 2022లోనే రిపోర్టు వచ్చినా, దానిని తొక్కిపెట్టి అపచారాన్ని కొనసాగించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ పామాయిల్‌తో చేసిన లడ్డూలను అయోధ్య రాముడి ఆలయానికి కూడా పంపడం లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో తాము రాజకీయం చేయడం లేదని, భక్తుల విశ్వాసాలను కాపాడటమే తమ లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి వాడలేదని వైసీపీ నేతలు తమకు తామే క్లీన్ చిట్ ఇచ్చుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. జరిగిన తప్పుకు ఏడుకొండల స్వామి ముందు దోషులు మోకరిల్లే వరకు, బహిరంగ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టేది లేదని పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. బాధ్యులందరినీ చట్టం ముందు, ప్రజల ముందు నిలబెడతామని ఆయన హెచ్చరించారు.








