లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్ ఎట్టకేలకు అజ్ఞాతం వీడి జనసేన పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యారు. మంగళవారం రైల్వే కోడూరులోని ఒక ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ విచారణలో కమిటీ సభ్యులు టి. శివశంకర్, తంబళ్ళపల్లి రమాదేవి, టి.సి. వరుణ్ ఆయనను సుమారు గంటన్నర పాటు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించడమే కాకుండా, ఇది తన రాజకీయ ఎదుగుదలను దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు పన్నిన పెద్ద కుట్ర అని వివరణ ఇచ్చారు.
విచారణలో భాగంగా అరవ శ్రీధర్ తన వాదనను వినిపిస్తూ.. సదరు మహిళ తనను కావాలనే ‘హనీట్రాప్’ చేసిందని, డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ వైసీపీ నాయకులతో కలిసి నాటకమాడుతోందని ఆరోపించారు. ఈ కుట్రను నిరూపించేందుకు తన వద్ద ఉన్న కీలక పత్రాలను, ఫోన్ రికార్డులను కమిటీకి సమర్పించినట్లు తెలుస్తోంది. మరోవైపు, కమిటీ సభ్యులు కేవలం ఎమ్మెల్యే వివరణతోనే సరిపెట్టకుండా స్థానిక జనసేన నేతలు, కార్యకర్తల నుంచి కూడా అభిప్రాయాలను సేకరించారు. బాధితురాలిగా పేర్కొంటున్న మహిళ కూడా తన ఫోన్ డేటాను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని డిమాండ్ చేస్తోంది.
ఈ విచారణ నివేదికను కమిటీ సభ్యులు నేరుగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు అందజేయనున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ చాలా సీరియస్‌గా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నివేదికలోని అంశాల ఆధారంగా ఎమ్మెల్యేపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలా లేదా అనే విషయంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని శ్రీధర్‌కు ఆదేశాలు జారీ చేసిన అధిష్టానం, తుది నిర్ణయాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంచింది.









