శబరిమల ఆలయ పరిసరాల్లో సినిమా చిత్రీకరణ జరిగిందన్న ఆరోపణలపై దేవస్వం విజిలెన్స్ విభాగానికి చెందిన ఎస్పీ సునీల్ కుమార్ సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం.. పంపా నది పరిసరాలతో పాటు, అత్యంత పవిత్రమైన మకరవిళక్కు పర్వదినం నాడు ఆలయ సముదాయానికి సమీపంలోని ఒక కొండపై షూటింగ్ నిర్వహించినట్లు స్పష్టమైంది. సన్నిధానంలో చిత్రీకరణ జరపలేదని చిత్ర దర్శకుడు అనురాజ్ మనోహర్ గతంలో చేసిన ప్రకటనలు అవాస్తవమని ఈ నివేదిక ద్వారా తేలిపోయింది.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) తదుపరి చర్యలకు సిద్ధమైంది. విజిలెన్స్ నివేదికతో పాటు షూటింగ్‌కు సంబంధించిన వీడియో ఆధారాలను బోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్ పరిశీలించారు. ఈ ఉల్లంఘనలపై ఎటువంటి చట్టపరమైన లేదా పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవాలనే అంశంపై బోర్డు ప్రస్తుతం న్యాయ నిపుణుల సలహాలను కోరింది. నిబంధనలను తుంగలో తొక్కి షూటింగ్ జరిపిన చిత్ర బృందంపై ఇప్పటికే ఒక కేసు నమోదైనట్లు సమాచారం.
సాధారణంగా మండల-మకరవిళక్కు యాత్ర సమయంలో భక్తుల రద్దీ దృష్ట్యా శబరిమలలో కఠినమైన భద్రత మరియు నియమాలు అమల్లో ఉంటాయి. అటువంటి కీలక సమయంలో పోలీసుల నుంచి గానీ, బోర్డు నుంచి గానీ అనుమతులు లేకుండా చిత్రీకరణ ఎలా సాగిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజిలెన్స్ నివేదికలో పోలీసుల అనుమతి ప్రస్తావన లేకపోవడం భద్రతా లోపాలను కూడా ఎత్తిచూపుతోంది. న్యాయసలహా అందిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.









