రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే తన పుస్తకంలో రాశారని, దీనిపై ఒక మ్యాగజైన్‌లో కథనం వచ్చిందని పేర్కొన్నారు. ఈ సున్నితమైన అంశాన్ని ప్రస్తావిస్తున్న సమయంలో రాహుల్ మైక్ కట్ అవ్వడంతో విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ ఓం బిర్లా తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష నేతలు నినాదాలు చేయడంతో సభలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
దీనిపై కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ ప్రస్తావించిన పుస్తకం ఇంకా ప్రచురితమే కాలేదని, పబ్లిష్ కాని పుస్తకంలోని అంశాలను సభలో ఎలా మాట్లాడతారని వారు ప్రశ్నించారు. ఇది సభా నిబంధనలకు విరుద్ధమని, రాహుల్ తన వ్యాఖ్యలకు సంబంధించి ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. సభను తప్పుదోవ పట్టించేలా ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నారని అమిత్ షా మండిపడ్డారు.
మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ రాహుల్‌కు మద్దతుగా నిలిచారు. చైనా చొరబాట్ల అంశం దేశ భద్రతకు సంబంధించినదని, ప్రతిపక్ష నేతను మాట్లాడనివ్వాలని ఆయన కోరారు. ఇరుపక్షాల మధ్య వాగ్వాదం పెరగడంతో సభలో నిశ్శబ్దం నెలకొనలేదు. దీంతో స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.









