AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రూపాయి పతనంపై కపిల్ సిబాల్ ఆగ్రహం: మోదీ మౌనాన్ని వీడాలని డిమాండ్!

కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత కరెన్సీ రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రోజురోజుకూ పడిపోతుంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సిబాల్ తన విమర్శల్లో ముఖ్యంగా గణాంకాలను ప్రస్తావించారు. 2014లో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 63గా ఉండేదని, అది ఇప్పుడు 92కు చేరుకుందని మండిపడ్డారు. రూపాయి విలువ ఇంతలా క్షీణించినప్పటికీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. గత 11 ఏళ్లలో రూపాయి పతనం సామాన్యుడిపై భారంగా మారిందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, ఆదివారం ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026 గురించి మాట్లాడుతూ.. గత 11 ఏళ్లుగా బడ్జెట్ సామాన్యుడికి నిరాశనే మిగులుస్తోందని అన్నారు. ఈ బడ్జెట్ అయినా పేదల బాధలను తగ్గించేలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటున్నప్పుడు, తక్కువ నిధులు ఉన్న రాష్ట్రాలు మరియు పేదల అభివృద్ధికి పెద్దపీట వేయాలని ఆయన హితవు పలికారు.

ANN TOP 10