భారతీయ సినీ దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తన 94 ఏళ్ల వయసులో మళ్ళీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మెగాఫోన్ పట్టుకోవడం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో, నాగ్ అశ్విన్ నిర్మాణంలో ‘SSR 61’ (వర్కింగ్ టైటిల్) అనే చిత్రాన్ని ఆయన పట్టాలెక్కించారు. “సెంచరీలు కొట్టే వయస్సు మాది” అంటూ ఆయన సెట్స్‌లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.
ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా ప్రారంభమైపోయింది. భారతీయ సినీ చరిత్రలో తొలి నిశ్శబ్ద చిత్రం ‘పుష్పక విమానం’, తొలి టైమ్ ట్రావెల్ చిత్రం ‘ఆదిత్య 369’ వంటి ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సింగీతం, తన 61వ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సింగీతం శ్రీనివాసరావు చివరగా 2013లో ‘వెల్కమ్ ఒబామా’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ‘కల్కి 2898 AD’ వంటి భారీ చిత్రాలకు స్క్రిప్ట్ మెంటార్‌గా తన అనుభవాన్ని పంచారు. ఈ కొత్త ప్రాజెక్టులో నటించబోయే హీరో హీరోయిన్లు మరియు సినిమా టైటిల్ వంటి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. 94 ఏళ్ల వయసులో కూడా ఆయనలో ఉన్న పని పట్ల అంకితభావం చూసి నెటిజన్లు మరియు సినీ ప్రముఖులు ఫిదా అవుతున్నారు.









