రాయలసీమ, ప్రకాశం మరియు మార్కాపురం ప్రాంతాలను ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవన (Horticulture) హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఏటా 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉద్యాన ఉత్పత్తుల సాధనే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 10 జిల్లాలను కేంద్ర బిందువుగా చేసుకుని, వచ్చే మూడేళ్లలో సాగు విస్తీర్ణాన్ని 8.41 లక్షల హెక్టార్ల నుండి 14.41 లక్షల హెక్టార్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నీటిపారుదల రంగాన్ని బలోపేతం చేసే దిశగా పెండింగ్‌లో ఉన్న 20కి పైగా కీలక ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును త్వరగా పునరుద్ధరించాలని ఆదేశించారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాలను రాయలసీమలోని చివరి భూములకు అందించడం ద్వారా కొత్తగా 8.87 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని సీఎం వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వ్యవస్థను మెరుగుపరచడంలో భాగంగా ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. పోలవరం కుడి కాలువ పనులు పూర్తయిన వెంటనే గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించి, పోలవరం-వంశధార నదుల అనుసంధానం చేపట్టనున్నట్లు సీఎం వెల్లడించారు. దుబాయ్‌కు చెందిన ‘డీపీ వరల్డ్’ వంటి అంతర్జాతీయ సంస్థలు ఏపీలో ఉద్యాన క్లస్టర్ల ఏర్పాటుకు ఆసక్తి చూపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్ కేంద్రాలు, లాజిస్టిక్స్ మరియు గ్లోబల్ మార్కెట్ కనెక్టివిటీని పెంపొందించడం ద్వారా రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అగ్రపథాన నిలుపుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.









