చంపాపేట్ : ఎల్‌బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని చంపాపేట్ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైటెక్ సిటీలోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి వార్త తెలియగానే చంపాపేట్ డివిజన్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండే నాయకుడిగా గుర్తింపు పొందిన మధుసూదన్ రెడ్డి, డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. స్థానిక సమస్యలపై చురుకుగా స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా ఆయనకు మంచి పేరు ఉంది. వంగ మధుసూదన్ రెడ్డి అకాల మరణం పార్టీకి తీరని లోటుగా మారిందని, అలాగే చంపాపేట్ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆయన భౌతిక దేహాన్ని ప్రజల దర్శనార్థం కర్మన్‌ఘాట్‌కు తరలించనున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులకు పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, స్థానికులు సంతాపం తెలియజేస్తున్నారు.









