తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న సమంత రూత్ ప్రభు, ఇటీవలే ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సాధారణంగా మహిళలు తమ ఇంటి పేరును మార్చుకోవడం లేదా భర్త ఇంటి పేరును జత చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో అక్కినేని నాగచైతన్యతో వివాహం జరిగినప్పుడు సమంత తన పేరును ‘సమంత అక్కినేని’గా మార్చుకుని, సోషల్ మీడియా ఖాతాల్లోనూ అప్‌డేట్ చేశారు. అయితే, విడాకుల తర్వాత తిరిగి తన పేరును పాత ఇంటి పేరుతో (సమంత రూత్ ప్రభు) కొనసాగించారు. ఇప్పుడు రెండో వివాహం తర్వాత ఆమె తన పేరు చివర ‘నిడిమోరు’ అనే టైటిల్‌ను చేరుస్తారా లేదా అన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం సమంత తన సొంత నిర్మాణ సంస్థలో ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రంలో నటిస్తున్నారు. విశేషమేమిటంటే, ఈ సినిమాకు ఆమె భర్త రాజ్ నిడిమోరు కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ సినిమా టైటిల్ కార్డులో ఆమె పేరు ఎలా పడబోతుందనే దానిపై సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సాధారణంగా బాలీవుడ్ భామలు పెళ్లి తర్వాత రెండు ఇంటి పేర్లను (ఉదాహరణకు కరీనా కపూర్ ఖాన్) వాడుతుంటారు. సమంత కూడా అదే బాటలో నడిచి ‘సమంత నిడిమోరు’గా స్క్రీన్ నేమ్ మార్చుకుంటారా? లేక కేవలం ‘సమంత’గానే ఉండిపోతారా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
డిసెంబర్ 2025లో వీరి వివాహం జరిగినప్పటికీ, ఇప్పటివరకు సోషల్ మీడియా ఖాతాల్లో సమంత తన పేరును మార్చలేదు. అయితే, సినిమా ప్రమోషన్లు ప్రారంభమయ్యే సమయానికి లేదా టైటిల్ కార్డులో కొత్త పేరును పరిచయం చేసే అవకాశం ఉందని సమాచారం. సమంత ప్రస్తుతం తన కెరీర్ మరియు వ్యక్తిగత జీవితం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో పాటు మరికొన్ని అంతర్జాతీయ ప్రాజెక్టులకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పేరు ఏదైనా, తన నటనతో ప్రేక్షకులను అలరించడంలో సమంత ఎప్పుడూ ముందే ఉంటారని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.









