AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మున్సిపోల్స్‌పై సేనాని గురి: గ్రామస్థాయి నుంచే లీడర్ల తయారీకి పవన్ ‘పవర్ స్ట్రాటజీ’!

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు మరియు మున్సిపల్ ఎన్నికల్లో జనసేన జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహాలను పదును పెడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సాధించిన 100 శాతం స్ట్రైక్ రేట్‌ను క్షేత్రస్థాయిలోనూ కొనసాగించాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. కేవలం పదవుల కోసం కాకుండా, పార్టీని పది కాలాల పాటు సుస్థిరంగా నిలబెట్టేందుకు ‘నాయకులు ఎక్కడి నుంచో రారు.. కార్యకర్తలే నేతలుగా ఎదగాలి’ అనే నినాదంతో గ్రామస్థాయి నుంచి కమిటీల నిర్మాణంపై ఆయన పూర్తి ఫోకస్ పెట్టారు.

పార్టీ సంస్థాగత బలోపేతం కోసం పవన్ ఇప్పటికే కఠినమైన డెడ్‌లైన్లను విధించారు. వచ్చే మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం నాటికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. కూటమిలో భాగంగానే ఉంటూనే, జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో మెజార్టీ స్థానాల్లో పోటీ చేసి క్షేత్రస్థాయిలో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ ప్రతినిధులు తమ నియోజకవర్గాల్లోని మౌలిక సదుపాయాలు, ప్రజా సమస్యలపై ప్రత్యేక నివేదికలు అందించాలని సూచించారు.

మరోవైపు, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే వ్యక్తిగత లేదా అంతర్గత వివాదాల విషయంలో పవన్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. నేతల వ్యక్తిగత బలహీనతలు లేదా ప్రవర్తన వల్ల పార్టీకి చెడ్డపేరు రాకూడదని, అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా, తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ జనసేన సత్తా చాటాలని పవన్ భావిస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా కార్యాచరణను సిద్ధం చేసి, త్వరలోనే తెలంగాణ కమిటీలపై కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

ANN TOP 10