AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేసిన జయశాంతి.. ఫిదా అయిన హోంమంత్రి అనిత!

విధి నిర్వహణలో లేకపోయినా, మానవత్వంతో వ్యవహరించిన తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ ఆముదాల జయశాంతిపై హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసల జల్లు కురిపించారు. జయశాంతికి స్వయంగా ఫోన్ చేసిన మంత్రి.. “మీలాంటి వారి వల్లే పోలీస్ శాఖపై ప్రజలకు నమ్మకం, గౌరవం పెరుగుతాయి” అని కొనియాడారు. విధి నిర్వహణలో ఆమె చూపిన చొరవను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆమె కుటుంబ యోగక్షేమాలను కూడా అడిగి తెలుసుకున్నారు.

అసలు ఏం జరిగిందంటే.. గత శనివారం రాత్రి కాకినాడ – సామర్లకోట కెనాల్ రోడ్డులో ఒక లారీ పాడైపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ సమయంలో విధి నిర్వహణ ముగించుకుని తన రెండున్నరేళ్ల బిడ్డతో కలిసి ఇంటికి వెళ్తున్న జయశాంతి, ట్రాఫిక్‌లో అంబులెన్స్‌లు చిక్కుకుపోవడాన్ని గమనించారు. వెంటనే స్పందించిన ఆమె, తన నిద్రపోతున్న బిడ్డను చంకలోనే ఉంచుకుని స్వయంగా రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అంబులెన్స్‌లు సాఫీగా వెళ్లేలా దారి క్లియర్ చేసి తన బాధ్యతను చాటుకున్నారు.

జయశాంతి తన బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు, ఉన్నతాధికారులు సైతం స్పందించి ఆమెకు సెల్యూట్ చేశారు. హోంమంత్రి అనిత ఈ విషయాన్ని తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో కూడా పంచుకుంటూ, జయశాంతిని త్వరలోనే ప్రత్యక్షంగా కలుస్తానని హామీ ఇచ్చారు. ఈ ఘటన ఏపీ పోలీసుల నిబద్ధతకు నిదర్శనంగా నిలిచిందని పలువురు ప్రశంసిస్తున్నారు.

ANN TOP 10