AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్: పెండింగ్ చలాన్ల కోసం బైక్ కీస్ లాక్కోవడం చట్టవిరుద్ధం!

తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూళ్లపై హైకోర్టు మంగళవారం అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. రోడ్లపై తనిఖీల పేరుతో వాహనాలను ఆపి, పెండింగ్ చలాన్లు ఉన్నాయనే నెపంతో వాహనదారుల నుంచి బలవంతంగా నగదు వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. ముఖ్యంగా పోలీసులు వాహనాల కీస్ లాక్కోవడం, వాహనాలను నడిరోడ్డుపై నిలిపివేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది.

చలాన్ల చెల్లింపు అనేది పూర్తిగా వాహనదారుడి స్వచ్ఛంద నిర్ణయం మీదనే ఆధారపడి ఉండాలని ధర్మాసనం పేర్కొంది. ఒకవేళ పోలీసులు వాహనాన్ని ఆపినప్పుడు, వాహనదారుడు తనంతట తానుగా పెండింగ్ చలాన్లు చెల్లిస్తానంటేనే పోలీసులు వసూలు చేయాలని సూచించింది. ఒకవేళ ఆ సమయంలో వాహనదారుడు చెల్లించడానికి నిరాకరిస్తే, అతడిని నిర్బంధించే అధికారం పోలీసులకు లేదని కోర్టు స్పష్టం చేసింది. చట్టపరమైన పద్ధతిలో నోటీసులు జారీ చేయడం ద్వారా మాత్రమే బకాయిలను రాబట్టాలని, రోడ్లపై వేధింపులకు గురిచేయడం సరికాదని హితవు పలికింది.

ట్రాఫిక్ నిబంధనల అమలు పేరుతో పౌరుల హక్కులను కాలరాయకూడదని హైకోర్టు ఈ సందర్భంగా పోలీస్ యంత్రాంగానికి గట్టి సందేశం ఇచ్చింది. జరిమానాల వసూలులో పారదర్శకత ఉండాలని, చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని ఆదేశించింది. పెండింగ్ చలాన్ల కోసం కోర్టు ద్వారా నోటీసులు పంపాలని సూచించింది. గత కొంతకాలంగా చలాన్ల వసూలు కోసం పోలీసులు అనుసరిస్తున్న కఠిన పద్ధతులపై సామాన్య జనం నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో, హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు వాహనదారులకు గట్టి భరోసానిచ్చింది.

ANN TOP 10