వీధి కుక్కల హక్కుల కోసం గళమెత్తుతున్న నటి రేణు దేశాయ్ తాజాగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా వీధి కుక్కల దాడి ఘటనల నేపథ్యంలో వాటిని చంపడాన్ని ఆమె వ్యతిరేకించగా, నెటిజన్ల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కాశీ పర్యటనలో ఉన్న ఆమె, గంగానదిలో బోటింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. “నన్ను కాపాడటానికి అమ్మానాన్న, అన్నయ్య, భర్త ఇలా ఎవరూ లేరు. నా తప్పు లేకపోయినా ఎంతోమంది నన్ను విమర్శిస్తున్నారు” అంటూ తన బాధను వెళ్లగక్కారు.
తాను నమ్మే భగవంతుడికే తన బాధను చెప్పుకుంటానని, అందుకే ప్రశాంతత కోసం తరచూ కాశీకి వస్తుంటానని ఆమె వివరించారు. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా, వీధి కుక్కలను సామూహికంగా చంపడాన్ని వ్యతిరేకిస్తూ తన పోరాటం కొనసాగిస్తానని రేణు స్పష్టం చేశారు. కొన్ని కుక్కలు చేసిన తప్పుకు వందల సంఖ్యలో జీవాలను బలితీసుకోవడం సరైన పద్ధతి కాదని, జంతు హక్కుల కోసం తన గొంతుక ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుందని ఆమె తేల్చిచెప్పారు.
ఇదే సమయంలో తన రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలకు కూడా రేణు దేశాయ్ స్వస్తి పలికారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని, ఇది కేవలం మూగజీవాల పట్ల ఉన్న ప్రేమే తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని క్లారిటీ ఇచ్చారు. వ్యక్తిగత హక్కుల కోసం తాను ఎప్పుడూ పోరాడలేదని, కానీ సమాజం ఈ మూగజీవాల ప్రాముఖ్యతను గుర్తించే వరకు వెనక్కి తగ్గనని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు.









