AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శర్వానంద్‌కు ఫోన్ చేసి అభినందించిన బాలయ్య

శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ సినిమా పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించి, శర్వానంద్ కెరీర్‌లో మరో భారీ హిట్ గా నిలిచింది. విశేషమేమిటంటే, ఈ చిత్రానికి గతేడాది నందమూరి బాలకృష్ణ స్వయంగా టైటిల్‌ను లాంచ్ చేశారు. గతంలో బాలయ్య కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన క్లాసిక్ సినిమా టైటిల్‌నే శర్వానంద్ తన సినిమాకు ఎంచుకోవడం విశేషం.

సినిమా సక్సెస్ మీట్‌లో శర్వానంద్ మాట్లాడుతూ బాలకృష్ణ స్పందన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలయ్య గారి సినిమా టైటిల్ తీసుకున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, ఆ పేరుకు ఎక్కడా తక్కువ కాకుండా న్యాయం చేయాలని చిత్ర యూనిట్ అంతా బాధ్యతగా పనిచేసినట్లు తెలిపారు. సినిమా చూసిన తర్వాత బాలయ్య స్వయంగా తనకు ఫోన్ చేశారని.. “సినిమా చాలా బాగుంది శర్వా.. నా పరువు నిలబెట్టావు” అని మనస్ఫూర్తిగా అభినందించారని శర్వానంద్ సంతోషం వ్యక్తం చేశారు.

అప్పుడు బాలకృష్ణకు, ఇప్పుడు శర్వానంద్‌కు ‘నారీ నారీ నడుమ మురారి’ అనే టైటిల్ బాగా కలిసి వచ్చిందని అభిమానులు సంబరపడుతున్నారు. సంక్రాంతి విజేతగా నిలిచిన ఈ సినిమాలో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటించగా, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక లెజెండరీ హీరో తన టైటిల్‌తో హిట్ కొట్టిన యువ హీరోను ఇలా ప్రోత్సహించడం టాలీవుడ్‌లో హెల్తీ వాతావరణానికి అద్దం పడుతోంది.

ANN TOP 10