AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

“బతకనీలెమ్మని వదిలేస్తా”: సోషల్ మీడియా రూమర్లపై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా తనపై వస్తున్న నెగెటివిటీ మరియు వార్తలపై ఘాటుగా స్పందించారు. పబ్లిక్ లైఫ్ లో ఉండే నటీమణులపై రూమర్లు రావడం సహజమని, అయితే కేవలం వ్యూస్ ద్వారా వచ్చే డబ్బు కోసమే కొంతమంది తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. అటువంటి వార్తలు కూడా ఎంతోమందికి ఉపాధిని ఇస్తున్నాయి కదా అని భావించి, “బతకనీలెమ్మని” తాను వాటిని పట్టించుకోకుండా వదిలేస్తానని రష్మిక హుందాగా సమాధానమిచ్చారు.

పారితోషికం విషయంలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. తాను ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్నానని వస్తున్న కథనాల్లో నిజం లేదని రష్మిక స్పష్టం చేశారు. “అది నిజమైతే బాగుండు అని నేను కూడా ఎదురుచూస్తున్నా” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసే విషయంపై కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలోని తనకు నచ్చిన ముగ్గురు దర్శకులు అడిగితే, ఆ సినిమాల్లో కథానాయికగా నటించకపోయినా కేవలం ఐటెం సాంగ్స్ చేయడానికి తాను సిద్ధమని పేర్కొన్నారు. అయితే ఆ ముగ్గురు దర్శకులు ఎవరనేది మాత్రం ఆమె సస్పెన్స్‌గా ఉంచారు.

భాషా పరమైన హద్దులు లేకుండా అన్ని రకాల చిత్రాల్లో నటించడమే తన లక్ష్యమని రష్మిక తెలిపారు. 2016 నుంచి ఇప్పటివరకు ఒకే తరహా అంకితభావంతో పనిచేస్తున్నానని, ప్రేక్షకులను అలరించడానికి వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటున్నట్లు వివరించారు. నెగెటివిటీ అనేది సినీ పరిశ్రమలో భాగమని, ఏదో ఒక రోజు ప్రజలకు నిజం తెలుస్తుందనే నమ్మకంతోనే తాను అన్నింటికీ స్పందించడం లేదని చెప్పారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నట్లు రష్మిక చెప్పుకొచ్చారు.

ANN TOP 10