AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రూ. 500తో రూ. 10 కోట్ల జాక్‌పాట్: డ్రైవర్‌ను వరించిన అదృష్టం!

హర్యానాలోని సిర్సా జిల్లా ముహమ్మద్‌ పురియా గ్రామానికి చెందిన 35 ఏళ్ల పృథ్వీ సింగ్‌ అనే డ్రైవర్ జీవితం ఒక్క రోజులో అనూహ్య మలుపు తిరిగింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పృథ్వీ సింగ్, తన కష్టాలు తీరాలనే ఆశతో పంజాబ్‌లోని కిలియన్‌వాలి గ్రామంలో ‘పంజాబ్ లోహ్రీ మకర్ సంక్రాంతి 2026 బంపర్ లాటరీ’ టికెట్‌ను కేవలం రూ. 500 పెట్టి కొనుగోలు చేశాడు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఆయనకు ఏకంగా రూ. 10 కోట్ల మొదటి బహుమతి దక్కింది. ఈ విషయం తెలియగానే మొదట నమ్మలేకపోయినప్పటికీ, ఆ తర్వాత నిజమని తెలియడంతో ఆయన కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

పృథ్వీ సింగ్‌ది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. ఆయనతో పాటు తండ్రి కూడా డ్రైవర్‌గా పని చేస్తుండగా, భార్య స్థానిక పాఠశాలలో ప్యూన్‌గా పనిచేస్తోంది. గతంలో రెండుసార్లు లాటరీ టికెట్లు కొన్నా అదృష్టం కలిసి రాలేదని, కానీ మూడో ప్రయత్నంలో ఈ భారీ మొత్తం దక్కడం విశేషమని పృథ్వీ తెలిపారు. ఈ అద్భుతమైన గెలుపు గురించి తెలిసిన గ్రామస్తులు, బంధువులు వందలాదిగా ఆయన ఇంటికి చేరుకుని అభినందనలు తెలియజేస్తున్నారు. పృథ్వీ సింగ్ ఒక్కసారిగా ఆ ప్రాంతంలో సెలెబ్రిటీగా మారిపోయారు.

ఈ భారీ మొత్తాన్ని ఎలా వినియోగిస్తారనే ప్రశ్నకు స్పందిస్తూ.. వచ్చిన డబ్బుతో ముందుగా తన కుటుంబ కష్టాలు తీర్చుకుంటానని, తన ఇద్దరు పిల్లల భవిష్యత్తు మరియు ఉన్నత చదువుల కోసం ఈ నిధిని ఉపయోగిస్తానని పృథ్వీ సింగ్ స్పష్టం చేశారు. ఆయన కుమారుడు మాత్రం తనకు ఒక పెద్ద లగ్జరీ కారు కొనాలని తన చిన్నారి కోరికను బయటపెట్టాడు. రాత్రికి రాత్రే సామాన్యుడి నుంచి కోటీశ్వరుడిగా మారిన పృథ్వీ సింగ్ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు వార్తా మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ANN TOP 10