కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ తనపై నిరాధారమైన, తన పరువునకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన నిరాధారమైన వ్యాఖ్యలకు వారం రోజుల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈనెల 19వ తేదీన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కేటీఆర్ నోటీసులో పేర్కొన్నారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటాడని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. దీనిపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బండి సంజయ్ చేసిన నిరాధరమైన కామెంట్లను నోటీసులో పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో తన తండ్రి కేసీఆర్ పేరును కూడా తీశారని చెప్పారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిత్వాన్ని అవమానపరిచేలా, ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని నోటీసులో తెలిపారు. కేవలం తనను అప్రతిష్ట పాలు చేయాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ వ్యాఖ్యలు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. తాను డ్రగ్స్ తీసుకుంటానని, ఫోన్ ట్యాపింగ్ చేశానని, కేసుల నుంచి తప్పించుకోవటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా కలిసిపోయానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరూపించాలని కేటీఆర్ సవాల్ చేశారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా తన పరువునకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ సహా డ్రగ్స్ ఆరోపణలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. వాటిన్నింటిని ఉద్దేశపూర్వకంగా కల్పించిన కట్టుకథలుగా కొట్టిపారేశారు.









