AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేను కూడా పంపిస్తా.. కాచుకో.. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు

నీవు సుద్దపూసవా.. నీ బాగోతం ప్రజలకు తెలుసు
కేటీఆర్‌ నోటీసులపై బండి సంజయ్‌ ఘాటు స్పందన

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటుండగా.. వారు చేసుకుంటున్న విమర్శలకు గానూ ఇప్పుడు నోటీసులు కూడా పంపించుకున్నారు. తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని.. వాటివల్ల తమ పరువుకు నష్టం వాటిళ్లుతోందంటూ పరువు నష్టం దావాలు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. బండి సంజయ్‌కు కేటీఆర్‌ నోటీసులు పంపించగా.. దానికి బండి సంజయ్‌ బదులిచ్చారు. మాటకు మాట.. నోటీసుకు నోటీసుతోనే సమాధానం చెప్తానంటూ సమాధానం ఇచ్చారు.

బండి సంజయ్‌ స్పందన..
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పంపించిన నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పందించారు. కేటీఆర్‌ తనకు లీగల్‌ నోటీసు పంపినట్లు మీడియాలో చూశానని తెలిపిన బండి సంజయ్‌.. లీగల్‌ నోటీసుతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్‌ నోటీస్‌ ఇవ్వడం చూస్తుంటే జాలేస్తోందన్నారు. తనపై మొదట కేటీఆరే వ్యక్తిగత ఆరోపణలు చేసి అవమానించినట్టు పేర్కొన్నారు సంజయ్‌. అందుకు బదులుగానే తాను మాట్లాడినట్టు తెలిపారు.

సుద్దపూస అనుకుంటున్నాడేమో..
‘కేటీఆర్‌ సుద్దపూస అనుకుంటున్నాడేమో. ఆయన బాగోతం ప్రజలకు తెలుసు. ఫోన్‌ ట్యాపింగ్, డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో ఏం జరిగిందో, ఆ కేసులను ఏ విధంగా నీరుగార్చారో తెలుసు. ఇప్పటి వరకు మాటకు మాటతోనే బదులిచ్చాను. ఇక.. లీగల్‌ నోటీసులకు నోటీసులతోనే బదులిస్తా. మేం చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తులం. చట్టం, న్యాయం ప్రకారం కూడా ముందుకు వెళతాం.’ అంటూ బండి సంజయ్‌ సమాధానం ఇచ్చారు.

ANN TOP 10