వెనుకబడ్డ ఈ ప్రాంతంపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి
ఐదు గ్యారంటీ హామీల అమలుతో ప్రజలకు మరింత చేరువ
అన్నివర్గాలకు మేలు చేకూరేలా ప్రజాపాలనతో ముందుకు..
త్యాగాల స్ఫూర్తితో అభివృద్ధిలో దూసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ శాఖ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ
జిల్లాలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరు
జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకం ఆవిష్కరణ
అమ్మ న్యూస్ ఆదిలాబాద్ :
ఎందరో మహానుభావుల పోరాటాలు, త్యాగాల ఫలితంగా స్వాతంత్రాన్ని సాధించుకున్నామని, ఆదిలాబాద్ సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, వెనుకబడ్డ ఈ ప్రాంతంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీశాఖ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన ప్రభుత్వం తరపున ముఖ్యఅతిథిగా హాజరు అయ్యారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలంతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ గీతం ఆలపించిన అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో తిరుగుతూ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఆరు గ్యారంటీలలో మహాలక్ష్మీ, గృహజ్యోతి, యువ వికాసం, చేయూత, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు అమలుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. మహాలక్ష్మీ పథకం ద్వారా ఇప్పటి వరకు 83 లక్షల 22 వేల 681 మంది మహిళలు ఉచిత ప్రయాణం సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు.
గృహజ్యోతి పథకంలో భాగంగా అర్హులైన 95 వేల 37 మంది వినియోగదారులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. బజార్‌హత్నూర్ మండలం పిప్రిలో విద్యుత్ పునరుద్ధరణ, అభివృద్ధి పనుల కోసం రూ.25.5 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే మహాలక్ష్మీ కింద లక్షా 73 వేల 256 మందికి ఎల్‌పీజీ సిలిండర్లను సరఫరా చేసినట్టు పేర్కొన్నారు. ఇందుకోసం రూ4.89 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. అటు రైతు రుణమాఫీ పథకం కింద రెండు విడతల్లో 36 వేల 387 మంది రైతులకు 322.29 కోట్ల రుణాలను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. మూడో విడత రుణమాఫీని సైతం జమ చేస్తామన్నారు. ఇందిరా మహిళాశక్తి ద్వారా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కార్యాచరణతో ముందుకెళ్తోందన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటివరకు 3 వేల 364 ఎంటర్ ప్రైజెస్‌లు, 19 మీ సేవా కేంద్రాలు, 108 ఏకరూప దుస్తుల కుట్టు కేంద్రాలు, నాలుగు మహిళా శక్తి క్యాంటీన్లు, 544 పాడిగేదెల పెంపకం యూనిట్లను ప్రారంభానికి సిద్ధం చేసినట్టుగా తెలిపారు.
సాగునీటి రంగానికి పెద్దపీట, ఇందిరమ్మ ఇంటితో సొంతింటి కల సాకారం
జిల్లాలోని రైతులకు సాగునీరు అందించేందుకు పెన్‌గంగా ప్రాజెక్టు నిర్మాణానికి 1596 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఇప్పటివరకు 1023 కోట్లు ఖర్చు చేసి పనులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లోయర్ పెన్‌గంగా ప్రాజెక్టు, చనకా- కొరటా ప్రాజెక్టుల భూసేకరణకు 134 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి వచ్చే యేడాదికి 27 వేల 800 ఎకరాలకు నీరందించేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. మిషన్ భగీరథ కింద జిల్లాలోని 1234 ఆవాసాలకు, పట్టణంలో ని ఇంటంటికీ శుద్ధి చేయబడిన తాగునీరు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. అటు ఇళ్లలేని పేదలకు 3 వేల 579 రెండు పడకల గదుల నిర్మాణాలకు ప్రతిపాదించడం జరిగిందని, ఇప్పటివరకు 674 గృహాలను రూ.93.5 వ్యయంతో పూర్తి చేసినట్టు తెలిపారు. మిగితా గృహాలు నిర్మాణ దశలో ఉండగా మరికొన్ని టెండర్ ప్రక్రియలో ఉన్నాయని పేర్కొన్నారు.అన్నివర్గాలకు మేలు చేకూర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకుసాగుతోందని, ఎందరో మహానీయుల త్యాగాల స్ఫూర్తితో అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు.

ఆకట్టుకున్న ప్రభుత్వశాఖల శకటాలు, స్టాళ్లు
78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలు, స్టాళ్లు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆర్టీసీశాఖ ద్వారా అమలవుతున్న మహాలక్ష్మీ పథకంలో భాగంగా అందిస్తున్న విశేష సేవలను ఆశాఖ సిబ్బంది వివరిస్తూ ప్రత్యేకంగా అలంకరించిన శకటాన్ని ప్రదర్శించి అభినందనలు అందుకున్నారు. అలాగే వైద్యారోగ్యశాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు, వైద్యసేవలపై అవగాహన కల్పిస్తూ శకటాన్ని ప్రదర్శించారు. అటు పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలోనూ మహాలక్ష్మీ స్కీమ్ ద్వారా సబ్సీడీపై సిలిండర్, ఇతర కార్యక్రమాల అమలును తెలియపరుస్తూ చక్కటి ప్రదర్శన ఇచ్చారు. అదేవిధంగా పలుశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను అతిథులు సందర్శించి పలు వివరాలు అడిగితెలుసుకున్నారు. ఆయా శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిపై ఆశాఖాధికారులు వారికి వివరించారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
ఆదిలాబాద్ పట్టణంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. పలు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. సినిమా పాఠలు, జానపద గేయాలు, దేశభక్తి గీతాలపై తమ నృత్య ప్రదర్శనలతో ఆహుతులను అలరించారు. అద్భుతమైన ప్రదర్శనలతో మంత్రముగ్ధుల్ని చేశారు. కస్తూరిగాంధీ బాలికల విద్యాలయం, జ్యోతిబాపూలే పాఠశాల తదితర పాఠశాలలకు చెందిన విద్యార్థులు భిన్నమైన గీతాలను ఎంచుకుని అదిరిపోయే స్టెప్పులతో ఉర్రూతలూగించారు. మదినిండా..జెండా పండుగను నింపేలా తమ ప్రదర్శనలతో అదరగొట్టారు. అనంతరం అతిథులు, అధికారుల చేతుల మీదుగా బహుమతులు పొంది ప్రశంసాపత్రాలు అందుకున్నారు.
ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు
జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌడ్‌లో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పలు ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందిస్తున్న ఉద్యోగులను గుర్తించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతోపాటు ఎంపీ గొడెం నగేష్, ఎమ్మెల్యేలు పాయల శంకర్, వెడ్మ బొజ్జు, కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం, డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ చేతుల మీదుగా ఈ ప్రశంసాపత్రాల ప్రదానోత్సవం జరిగింది. ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణంలో జరిగిన వేడుకల్లో ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









