పంపు హౌస్ 2కు స్విచ్ ఆన్ చేసిన సీఎం రేవంత్
గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు
(అమ్మన్యూస్, ఖమ్మం):
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయకట్టుకు గోదావరి జలాలను సరఫరా చేసే సీతారామ ఎత్తిపోతల పథకం పంపుహౌస్, రాజీవ్ కెనాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి పంపుహౌస్–2ను స్విచ్చాన్ చేసి గోదావరి జలాల ఎత్తిపోతలను ప్రారంభించారు. అదేవిధంగా ప్రాజెక్టును రాష్ట్ర ప్రజలకు అంకితం చేశారు.
ఈ సందర్భంగా ఆయన గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు, కంకుమ, పట్టు వస్త్రాలను వదిలారు. కాగా, ఈ పథకం కింద సుమారు 3.29 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 3.45 లక్షల ఎకరాల ఇప్పటికే వాడుకలో ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అదేవిధంగా అశ్వాపురం మండలం కొత్తూరు వద్ద సీతారామ పంప్ హౌజ్–1ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రారంభించారు. ఇక ములకపల్లి మండలం కమలాపురం 3వ పంప్ హౌజ్–3ని రాష్ట్ర డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు.









