మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో భారీ వర్షం కారణంగా నిర్మాణంలోఉన్న గోడ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతిచెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మంగళవారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. కూలిన గోడ శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు జీహెచ్ ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు చేపట్టారు.
మృతులంతా ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల్లో ఓ మహిళ, నాలుగు సంవత్సరాల బాలుడు కూడా ఉన్నారు. గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం స్థానికి ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులు తిరుపతిరావు (20), శంకర్ (22), రాజు (25), రామ్ యాదవ్ (34), గీత (32), హిమాన్షు (4), ఖుషిగా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మరోవైపు బాచుపల్లి ఘటన నేపథ్యంలో రైజ్ కన్ స్ట్రక్షన్ ఎండీ అరవింద్ రెడ్డి పై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. భవన నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం, కార్మికుల విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. ఏడుగురి మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం స్వరాష్ట్రాలకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారు క్షేమంగా ఉన్నారని అధికారులు చెప్పారు.









