AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేస్తాం

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఒక్కటే..
వేములవాడ సభలో ప్రధాని మోదీ..

(అమ్మన్యూస్, వేములవాడ):
తెలంగాణలో బీజేపీ విజయ ఢంకా మోగించడం ఖాయమని ప్రధాని మోదీ అన్నారు. బుధవారం వేములవాడకు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ లోక్‌ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలనంతరం బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా బహిరంగ సభలో ప్రసంగించారు. అంతకుముందు ప్రధాని మోదీకి పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. బీజేపీ నేతలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సభావేదకపైకి చేరుకున్న వెంటనే మోదీకి పలువురు బీజేపీ నేతలు శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం మోదీ ప్రసంగించారు. సభలో తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు గతంలోలాగే అందరికీ నమస్కారం అంటూ తెలుగులో మాట్లాడుతూ కార్యకర్తల్లో జోష్‌ నింపారు.

కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో బండి సంజయ్‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మే 7న దేశంలో మూడోవిడత లోక్‌ సభ ఎన్నికల పోలింగ్‌ జరిగిందని అందులో ఇండియా కూటమి ఫ్యూజ్‌ పోయిందని విమర్శించారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగితే మూడింటిలో ఇండియా కూటమి ఫ్యూజ్‌ పోయిందని ఎద్దేవా చేశారు. దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మీ ఓటు వల్లే తాను ఎన్నో నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రజలకు తెలిపారు. ఎన్డీయే విజయరథయాత్ర ప్రారంభమైందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అని ఆరోపించారు. తెలంగాణను కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీల నుంచి కాపాడాలని పిలుపునిచ్చారు.

బీజేపీకి నేషన్‌ ఫస్ట్‌ అయితే, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఫ్యామిలీ ఫస్ట్‌ అంటూ విమర్శించారు. పీవీని కాంగ్రెస్‌ పార్టీ అవమానించింది అన్నారు. పీవీ పార్థీవదేహాన్ని గతంలో కాంగ్రెస్‌ తన ఆఫీస్‌లో కూడా అనుమతించలేదన్నారు. పీవీకి తమ ప్రభుత్వం భారతరత్న ప్రదానం చేసిందన్నారు. పీవీ నరసింహరావు కుటుంబంలో రెండు, మూడు తరాలతో సుదీర్ఘంగా మాట్లాడినట్లు తెలిపారు. అవినీతి అనేది కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లో కనిపించే ప్రధాన లక్షణం అని విమర్శించారు. హైదరాబాద్‌ లో ఎంఐఎంను గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు పనిచేస్తున్నాయన్నారు. తెలంగాణను ఆర్‌ఆర్‌ నుంచి విముక్తి చేయాలన్నారు. . అంబేద్కర్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్‌ లాక్కొని ముస్లిం సామాజికవర్గానికి ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రయాత్నిస్తోందన్నారు. మాదిగ సామాజికవర్గానికి రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్‌ అడ్డుపడుతోందన్నారు.

ANN TOP 10