(అమ్మన్యూస్, హైదరాబాద్):
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ జిల్లాలో పార్టీ మారిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను తానే కాంగ్రెస్ లోకి పంపించానని అన్నారు. వారంతా తనకు కోవర్టులుగా పని చేస్తున్నారని తెలిపారు. వారంతా కాంగ్రెస్ కండువా కప్పుకుని బీఆర్‌ఎస్ కోసం పని చేస్తున్నారని మల్లారెడ్డి వెల్లడిరచారు.
‘బీఆర్‌ఎస్ నుంచి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు.. కాంగ్రెస్ అధికారంలోకి ఉందని వెళ్లారు. బీఆర్‌ఎస్ ను వీడి పోయినందుకు వాళ్లకు బాధగా ఉంది. రోజూ వారికి ఫోన్లు చేస్తున్నా. మేము కాంగ్రెస్ లో ఉండలేకపోతున్నాం, మేము మళ్లీ బీఆర్‌ఎస్ లోకి వచ్చేస్తాం అంటున్నారు. కాంగ్రెస్ లో ఉన్న పాత వాళ్లతో మాకు బాగా ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. ఈ ఎన్నికల్లో కాకపోతే వచ్చే ఎన్నికల్లో మనం గెలుస్తాం. మీరు అక్కడే ఉండండి. ఆ తర్వాత చూసుకుందాం. అక్కడే ఉంటూ ఇక్కడ ఓటు వేయండి అని వారితో చెప్పాను’ అని మల్లారెడ్డి అన్నారు.









