AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఓట్ల కోసం మా ఊరికి రావొద్దు.. అధికార పార్టీ నేతలకు జనం వార్నింగ్..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఓటర్లు అధికార పార్టీ నేతలపై భగ్గుమంటున్నారు. మా ఊరికి రావొద్దుంటూ.. హుకుం జారీ చేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం ఒక్కటే.. తమ గ్రామాల్లో దశాబ్దకాలంగా అభివృద్ధి జరగడంలేదని, ఎన్ని ఆందోళనలు చేసినా.. ఎంత మంది నేతలకు మొరపెట్టుకున్నా.. కనీసం పట్టించుకున్నవారే లేరని నిప్పులు చెరుగుతున్నారు. అందుకే మీ ఓట్ల పండుగకు మాకు సంబంధం లేదంటున్నారు ఉమ్మడి ఆదిలాబాద్‌ లోని ఖానాపూర్‌ , ఆసిఫాబాద్‌ నియోజక వర్గాల పరిధిలోని 18 గ్రామాల ప్రజలు.

కనీసం నడిచేందుకు రోడ్లు లేవు..
ఈ 18 గ్రామాలు ఆదివాసీ ప్రాంతాలు కావడం.. ఆయా గ్రామాలకు దశాబ్దాలుగా రోడ్డు సౌకర్యం లేకపోవడం.. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామంటూ ఎన్నికల సమయంలో హామీ గుప్పించడం.. ఆతర్వాత తమ గ్రామాలకు కనీసం తొంగి కూడా చూడటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ 18 గ్రామాల ప్రజలు ఎన్నికలు మాకొద్దు అంటూ పిలుపునిచ్చారు. తాజాగా ఎన్నికల బహిష్కరణ ప్రకటన చేసిన నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ నియోజక వర్గం కడెం మండలం గంగాపూర్‌ గ్రామపంచాయితీలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు కోసం వెళ్లిన తహసీల్దార్‌ రాజేశ్వరి బృందాన్ని, అధికార పార్టీ నేతలను గ్రామస్తులు అడ్డుకున్నారు.

గంగాపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని 12 గ్రామాలు రెండు దశాబ్దాలుగా నరక యాతన అనుభవిస్తున్నాయని.. స్వరాష్ట్రం సిద్ధించినా మాకు న్యాయం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు సౌకర్యం కల్పించిన తర్వాతే తమ గ్రామంలోకి అడుగుపెట్టాలంటూ నిర్మల్‌ జిల్లా కడెం మండలంలోని గంగాపూర్‌ గ్రామస్తులు తేల్చి చెప్పారు. గ్రామస్తులు ఐక్యంగా ఉండటంతో ఏం చేయలేక వెనుతిరిగారు నేతలు, అధికారులు.

ANN TOP 10