ఆకలితో పస్తులు.. ఆపన్నహస్తం కోసం దిక్కులు
తల్లడిల్లుతున్న కళామతల్లి ముద్దుబిడ్డ
రంగురంగుల ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ఆ తార జీవితాన్ని చీకట్లు కమ్మేశాయి. వెండితెరపై నవ్వుల వాన కురిపించిన ఆ నటి ఇప్పుడు నిస్సాహయస్థితిలో ఉన్నారు. తనను కాపాడాలంటూ ఆ కళామాతల్లి ముద్దుబిడ్డ చేతులెత్తి అర్థిస్తున్నారు. దయనీయ జీవితం గడుపుతున్న నటి పావలా శ్యామల నిజజీవిత కథ ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది. కంటతడి పెట్టిస్తోంది.
పావలా శ్యామల… ఆ పేరు తలుచుకోగానే ఆమె విలక్షణమైన హాస్య నటన గుర్తుకు వచ్చి అందరి పెదాలపై చిరునవ్వులు పూస్తాయి. కానీ అందరికీ ఆనందం పంచిపెట్టిన ఆమె మాత్రం చాలాకాలంగా దయనీయ జీవితం గడుపుతున్నారు. నిస్సాహయస్థితిలో ఉన్న ఈ సీనియర్ నటి ఆపన్నహస్తం అందించాలని అర్థిస్తోంది. ఒకవైపు ఆర్థిక భారం.. మరో వైపు వయోభారం ఆమెకు నరకం చూపిస్తున్నాయి. అంతేకాకుండా ఎదిగిన కూతురు మంచానికే పరిమితమవ్వడం తీవ్ర మనోవేదనను కల్గిస్తోంది. గతంలో ఆమెకు కొంత మంది నుంచి సాయం అందినా అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కల్గించింది.
తనకు వచ్చిన అవార్డులను అమ్ముకొని ఆ డబ్బుతో బియ్యం, పప్పులు కొనుకొన్నరోజులున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న తాము తినడానికి తిండి లేక ఒక్కోసారి ఐదు రోజులు పస్తులుండాల్సి వచ్చిందని చెప్పారు. ఇక మందులు ఎక్కడి నుంచి కొనుక్కోగలమని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఇలాగే ఉంటే ఏదో ఓ రోజు ఇద్దరం మంచంలోనే ఆకలితో చనిపోతామని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకోవడానికి సైతం శక్తి చాలడంలేదని చెబుతున్నారంటే ఆమె పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్థంచేసుకోవచ్చు.
పావలా శ్యామల 1984లో బాబాయ్ అబ్బాయ్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రవేశించి స్వర్ణ కమలం, కర్తవ్యం, ఇంద్ర, ఖడ్గం, బ్లేడ్ బాబ్జీ, గోలీమార్ వంటి సుమారు 250 సినిమాలలో హాస్య నటిగా, సహాయ నటిగా నటించారు. అనేక అవార్డులు అందుకొన్నారు. ఆమె నటనకు అనేక సంస్థలు సన్మానాలు చేశాయి. అటువంటి సినీ కళామతల్లి ముద్దుబిడ్డకు నేడు తినడానికి తిండి కూడా లేక, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.

దినదిన గండంగా బతుకీడుస్తూ, ఆపన్నహస్త కోసం ఎదురుచూస్తున్న నటి పావలా శ్యామలకు సహాయం చెయ్యాలనుకునేవారు.. Neti Shyamala , A/c: 52012871059, IFSC :SBIN0020458, Srikrishna Nager , Yusuf guda Beanch , Hyderabad , Cell : 98 49 175713 సంప్రదించవచ్చు. పావలా శ్యామల ప్రస్తుతం ఫిర్జాదీగూడ లోని ఓ వృద్దాశ్రమంలో ఉంటుంది.. ఆ ఆశ్రమానికి నెలవారి డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతుంది.. . ఆమెకు డబ్బు, మందులు, నిత్యావసర సరుకులు మరేదైనా ఇచ్చి సాయపడాలనుకొంటే నేరుగా ఆమె ఇంటికే వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. సినీ కళామతల్లి ముద్దుబిడ్డను కాపాడుకోవాల్సిన సమయమిది.









