తెలంగాణలో ఎన్నికల హోరు రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల కాగా.. ఎన్నికలకు సమయం కూడా దగ్గరపడుతోంది. ఈ సమయంలో.. పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. కాగా.. చాలా రోజులుగా అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్ అధిష్ఠానం చేస్తున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. తమ పార్టీ తరపున పోటీ చేసే గెలుపు గుర్రాల మొదటి లిస్టు సిద్ధమైనట్టు తెలుస్తోంది. 58 మందితో కూడిన ఫస్ట్ లిస్టును (నేడు) అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్టు తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ వెల్లడించారు. ఇదే సమయంలో పొత్తులపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఇంట్లో నేతలు భేటీ కాగా.. అభ్యర్థుల విషయంతో పాటు పొత్తులపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మురళీధరన్.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. మొదటి లిస్టులో భాగంగా.. 58 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలిపారు. నేడు. తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించనుంది. మరో రెండు రోజుల్లో మిగతా స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు మురళీధరన్ స్పష్టం చేశారు.









