తనకు ప్రాణహాని ఉంది అని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్… నిన్న (శనివారం) కాకినాడలో.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్… తనకు ప్రాణహాని ఉంది అని చెబుతూ… 2019లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. వైసీపీ అధికారంలోకి రాకపోయి ఉంటే.. తనను చంపేసేవారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇందుకు సంబంధించి ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
“అధికారం చేజిక్కించుకునే నాయకులు క్రూరంగా మారిపోతారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారం కోల్పోకూడదు అని బలంగా భావిస్తారు. అధికారం నిలబెట్టుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. బాలు సినిమా సమయంలో ఓ IPS అధికారి నా దగ్గరకు వచ్చి మీ కుటుంబంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టాలని భావిస్తున్నారా? అని అడిగారు.. ఎందుకు అని నేను అడిగితే మీ కుటుంబానికి హాని తలపెట్టే అవకాశం ఉంది అని చెప్పారు.
“రాజకీయాల్లో పదవి పోతుందనే భయం చాలా చెడ్డది. తమకు హాని చేస్తారని తెలిస్తే, కడుపులోని బిడ్డను కూడా చంపేందుకు వెనుకాడరు. ప్రస్తుతం జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో బలంగా ఉంది. అధికారం నుంచి వైసీపీ పాలకులను గద్దె దించే దిశగా పయనిస్తోంది. ఇలాంటి సమయంలో వారు ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారు. నాకు ప్రాణహాని ఉంది. సుపారీ గ్యాంగులను ప్రత్యేకంగా దింపారనే సమాచారం ఉంది. కచ్చితంగా భద్రతా నియమాలను నాయకులతో పాటు జనసైనికులు, వీర మహిళలు తప్పనిసరిగా పాటించాలి. నేటి వైసీపీ పాలకులు అధికారం కోసం ఏం చేయడానికి అయినా సిద్ధమే. నన్ను భయపెట్టే కొద్దీ నేను మరింత రాటు దేలుతాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు. తనకు ప్రాణహాని ఉంది అని స్వయంగా పవన్ కళ్యాణ్ అనడంతో… ఇప్పుడు ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.









