ప్రభాస్ కీలక పాత్రలో ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిపురుష్ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే, ఈ సినిమాకు వ్యతిరేకంగా కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. హిందువుల విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీసేలా సినిమాను తీశారంటూ హిందూసేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్త ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ‘వాల్మీకి, తులసీదాస్ వంటి వారు రచించిన రామాయణంలోని పాత్రలకు విరుద్ధంగా ఈ చిత్రంలోని ప్రధాన పాత్రలను అనుచిత రీతిలో తెరకెక్కించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇందులో పాత్రలు ఉన్నాయి. ఈ చిత్రంలో దేవతామూర్తుల వర్ణన సరైన రీతిలో లేదు. హిందూ బ్రాహ్మణుడైన రావణ పాత్రధారి గడ్డంతో కన్పించడం అభ్యంతరకరంగా ఉంది. ఇది హిందూ నాగరికతను అవమానించడమే. రావణుడికి సంబంధించిన సన్నివేశాలను కూడా వాస్తవాలకు దూరంగా తెరకెక్కించారు.
ఇందులో దేవతామూర్తులకు సంబంధించిన అభ్యంతకర సన్నివేశాలను సరిదిద్దడం లేదా తొలగించడం చేయాలి. లేదంటే సినిమా ప్రదర్శనను నిలిపివేయాలి’ అని విష్ణు గుప్త తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా.. ఆదిపురుష్ సినిమా విడుదలకు ముందు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. గతంలో ఈ సినిమా టీజర్ విడుదలైన సమయంలో.. చిత్రంలో రాముడు, రావణుడు, హనుమంతుడు పాత్రలను చూపించిన విధానం సరైందని కాదని.. పలు సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ క్రమంలోనే ఆదిపురుష్ చిత్రబృందం హిందువుల మనోభావాలను దెబ్బతీసిందంటూ ఓ సంస్థ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే విజువల్స్‌లో కొన్ని మార్పులు చేసి సినిమాను నిన్న విడుదల చేశారు. కాగా.. ఈ సినిమాకు విశేష స్పందన లభించినప్పటికీ.. కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.









