ఉగాండాలో దారుణం చోటుచేసుకుంది. కాంగో సరిహద్దు సమీపంలో ఉన్న ఎంపాండ్వే పట్టణంలోని ఓ పాఠశాలపై సాయుధ తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో 26 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అలయిడ్ డెమొక్రటిక్ ఫోర్సెస్‌కు చెందినవారే ఈ దాడులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ‘20 నుంచి 25 మంది తిరుగుబాటుదారులు ఇక్కడి లుబిరిరా సెకండరీ పాఠశాలపై దాడులు జరిపారు.
అనంతరం వసతిగృహానికి నిప్పుపెట్టారు. ఇప్పటివరకు 26 మృతదేహాలను వెలికితీశాం. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇక్కడి ఆహారశాలనూ వారు దోచుకున్నారు’ అని తెలిపారు. దాడి అనంతరం తిరుగుబాటుదారులు కాంగో దేశంలోని విరుంగా జాతీయ పార్కు దిశగా పారిపోయినట్లు గుర్తించామని, వారిని వెంటాడుతున్నామని పోలీసులు చెప్పారు. పరారయ్యే ముందు పలువురిని అపహరించుకుపోయినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా.. 1986 నుంచి అధికారంలో ఉన్న ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని పాలనను ఏడీఎఫ్ వ్యతిరేకిస్తోంది. 2001లో ఉగాండా సైన్యం ఎదురుదాడులతో తూర్పు కాంగోలోకి పారిపోయి.. అక్కడినుంచి హింసకు తెగబడుతోంది. ఏడీఎఫ్‌కు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తోనూ సంబంధాలు ఉన్నాయి. దీంతో ఏడీఎఫ్ తిరుగుబాటుదారులను అణచివేసేందుకు ఉగాండా ప్రభుత్వం వైమానిక, ఫిరంగి దాడులు చేపడుతోంది.









