ఒడిశాలో మరణఘోష తాండవం చేస్తుంది. అనుకోని ప్రమాదం… ఊహలకందని ప్రాణనష్టం.. ఎందరో ప్రయాణికులను పొట్టన పెట్టుకుంది రైలు ప్రమాదం. ఒడిశాలోని బాలేశ్వర్ లో జరిగిన ట్రైన్ ఆక్సిడెంట్ ఎందరో కుటుంబాల్లో కన్నీటిని నిపింది.
బాలేశ్వర్ జిల్లాలో ప్రయాణికులతో కోల్ కతా నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఘోరప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది చనిపోయారు. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి వేళ ప్రమాదం చోటుచేసుకోవడంతో.. బోల్తాపడిన బోగీల్లో ఇంకా ఎంతమంది చిక్కుకొని ఉండొచ్చనేది అధికారులు సరిగా అంచనా వేయలేకపోతున్నారు.
స్థానిక అధికారుల కథనం ప్రకారం- బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డాకు వెళ్తున్న బెంగళూరు-హావ్‌డా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. వాటిని షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. దాంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదం అక్కడితో ఆగిపోలేదు. బోల్తాపడ్డ కోరమండల్ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది.
మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా పెరిగింది. ప్రమాదానికి గురైన సమయంలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కోల్‌కతా నుంచి చెన్నైకి వెళ్తోంది. అయితే రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ కథనం మాత్రం మరోలా ఉండటం గమనార్హం. తొలుత కోరమండల్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందని అమితాబ్ చెప్పారు. దాని 10-12 బోగీలు బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్ రైలు మార్గంలో పడ్డాయని పేర్కొన్నారు. అనంతరం ఆ సూపర్‌ఫాస్ట్ బోగీలు పక్క ట్రాక్‌పై బోల్తాపడ్డాయని వివరించారు.
ప్రమాదం అనంతరం బోగీల్లో చిక్కుకున్నవారి హాహాకారాలతో ఘటనాస్థలం దద్దరిల్లింది. దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. సత్వరం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. బాలేశ్వర్‌లోని వివిధ ఆసుపత్రుల్లో 400 మంది క్షతగాత్రులను అధికారులు చేర్పించారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ సహా బాలేశ్వర్, భువనేశ్వర్, భద్రక్, మయూర్‌బంజ్, కటక్‌ల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను అప్రమత్తం చేశారు.
బోల్తాపడ్డ బోగీల నుంచి ఇప్పటివరకు 50 మంది మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా పలువురు వాటి లోపల చిక్కుకొని ఉన్నారని, వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. స్థానికులు కూడా తమకు సహకరిస్తున్నారని వివరించారు. ఇప్పటివరకు నాలుగు యూనిట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్, మూడు యూనిట్ల ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలను మోహరించారు. 115 అంబులెన్సులను రంగంలోకి దించారు.
ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో మన దేశంలో చోటుచేసుకున్న అతిపెద్ద రైలుప్రమాదం ఇదేనని పలువురు చెబుతున్నారు. ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల్లో బెంగాల్‌వాసులే ఎక్కువమంది ఉన్నట్లు తెలుస్తోంది.ఒడిశా రైలు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరారు.కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. ఒడిశా రైలు ప్రమాద ఘటనపై తమిళనాడు సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం స్టాలిన్ ఘటనపై ఒడిశా సీఎంతో మాట్లాడారు. సహాయక చర్యల కోసం తమిళనాడు రవాణశాఖ మంత్రి ఒడిశాకు వెళ్తున్నారు. రవాణాశాఖ మంత్రితో పాటు ఒడిశాకు ముగ్గురు ఐఏఎస్ అధికారులు వెళ్తున్నారు. కేంద్రం, ఒడిశా ప్రభుత్వం మృతులకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడినవారికి రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు ప్రకటించారు. సహాయక చర్యల కోసం పలు రైల్వే స్టేషన్ లలో హెల్ప్లైన్ నెంబర్ లు ఏర్పాటు చేశారు. కాసేపట్లో నవీన్ పట్నాయక్ ఘటన స్థలానికి చేరుకోనున్నారు.









