జైపూర్: రాజస్థాన్ సచివాలయం పనిచేసే యోజన భవన్‌లోని బేస్‌మెంట్‌లో గల ఒక అలమారలో రూ.2.31 కోట్లకు పైగా నగదు, ఒక కిలో బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌బిఐ రూ.2,000 నోట్లను ఉపసంహరించిన రోజే ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడం విశేషం. యోజన భవన్‌లోని బేస్‌మెంట్‌కు వెళ్లే అధికారం ఉన్న ఏడుగురు సచివాలయ ఉద్యోగులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
అలమారలో భద్రపరిచిన ఒక సూట్‌కేసులో రూ.2,000, రూ. 500 కరెన్సీ నోట్లు లభించినట్లు పోలీసులు తెలిపారు. సూట్‌కేసులోనే ఒక కిలో బంగారం కూడా ఉన్నట్లు వారు చెప్పారు. వెంటనే ఈ విషయం గురించి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు అధికారులు తెలియచేశారు. రాత్రికిరాత్రే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఉషా శర్మ, డిజిపి ఉమేష్ మిశ్రా, ఎడిజిపి దినేష్, జైపూర్ కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవ సచివాలయంలో సంయుక్త విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.









