AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇప్పుడు మహారాష్ట్ర రైతులను ముంచే పనిలో కేసీఆర్

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ సంస్థాగత నిర్మాణంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టడం, శుక్రవారం నాందేడ్‌లో బీఆర్ఎస్ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడంపై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. కేసీఆర్ తీరుపై ట్విట్టర్‌లో షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో రైతులు అసెంబ్లీకి పోవాలంటూ గొప్పలు చెప్పిన కేసీఆర్.. తెలంగాణలో రైతులకు టికెట్లు ఇవ్వగలరా? అంటూ సవాల్ చేశారు. 119 నియోజకవర్గాల్లో రైతులను బీఆర్ఎస్ నుంచి పోటీలోకి దింపాలని సూచించారు. రైతుల పేర్లు చెప్పి మహారాష్ట్రను దోచుకునేందుకు కేసీఆర్ సిద్దమయ్యారని షర్మిల ఆరోపించారు.

తెలంగాణలో రైతు సమాధులపై దాష్టీక పాలన నడుపుతున్న కేసీఆర్.. ఇప్పుడు మహారాష్ట్ర రైతులను ముంచే పనిలో పడ్డారని షర్మిల విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బుడ్డ దొరలకు, జమీందార్లకు, ఉద్యమద్రోహులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఆయన.. మహారాష్ట్రలో మాత్రం రైతులు అసెంబ్లీలో అడుగుపెట్టాలంటూ చెబుతున్నారని అన్నారు. తెలంగాణ మోడల్ అంటే.. తొమ్మిదేళ్లల్లో 9వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ మోడల్ అంటే.. పంట బీమా ఇవ్వకపోవడమా? పంట నష్టం జరిగితే మాట ఇచ్చి పరిహారం ఎగ్గొట్టడమా? రాయితీ ఎరువులు, విత్తనాలు ఎత్తేయడమా? బడా బాబులకు రూ.వేల కోట్ల రైతుబంధు దోచిపెట్టడమా? అంటూ ప్రశ్నలు కురిపించారు.

‘తెలంగాణ మోడల్ అంటే.. ప్రాజెక్టుల పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకోవడమా? కనీస కనికరం లేకుండా రైతుల భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమా? అసైన్డ్ భూములను సైతం లాక్కొని రైతును రోడ్డున పడేయడమా? కౌలు రైతులు రైతే కాదని చెప్పడమా? వరి వేస్తే ఉరేనని రైతులను బెదిరించడమా?’ అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 119 చోట్ల రైతులకే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ANN TOP 10