కర్ణాటక సీఎం కుర్చిపై ఉత్కంఠ నెలకొంది. ఈ రాజకీయం ఢిల్లీకి చేరుకున్న నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారం నేపథ్యంలో సిద్ధరామయ్య ఢిల్లీకి చేరుకోగా, డీకే శివకుమార్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక కేసీ వేణుగోపాల్, సుశీల్ కుమార్ షిండేలు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి చేరుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారంపై సమావేశం కానున్నారు.
డీకే శివకుమార్ ను ట్రబుల్ షూటర్ గా కర్నాటక రాజకీయాల్లో చెప్పుకుంటారు. ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే రంగంలోకి దిగిపోయి పరిష్కరించడమే ఆయనకు తెలుసు. అలాంటి కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివ కుమార్ ఇపుడు కాంగ్రెస్ అధినాయకత్వానికే బిగ్ ట్రబుల్ అవుతున్నారని అంటున్నారు.
ఆయన కర్నాటక సీఎం సీటునే టార్గెట్ చేశారు. నా దగ్గర ఎలాంటి బేరాలు లేవని చెప్పేస్తున్నారు. తానే అయిదేళ్ళ సీఎం అని అంటున్నారు. చెరి రెండున్నరేళ్ళు సీఎం గా ఉండాలని ఒక ఫార్ములా హై కమాండ్ రూపొందించినా డీకే నో అనేస్తున్నారు. నాకు ఇస్తే అయిదేళ్ల సీఎం పోస్ట్ ఇవ్వండి. లేక పోతే లేదు నాకు కనీసం మంత్రి పదవి కూడా సిద్ధరామయ్య క్యాబినెట్ లో వద్దు అని తేల్చేస్తున్నారు.
కర్నాటక కాంగ్రెస్ ఇంచార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలాతో మూడు గంటల పాటు డీకే సమావేశం అయినా ఒక్కటే మాట చెప్పారని అంటున్నారు. ఎందుకొచ్చిన బేరాలు. నాకు సీఎం పదవి మాత్రమే కావాలి. నా ఆప్షన్ అదే. రెండవ చాన్స్ లేదని అంటున్నారని టాక్. ఇక కర్నాటకకే చెందిన ఏఈసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గె సైతం చెరి రెందున్నరేళ్ళు పదవి తీసుకోమని కోరారు. దానికి సిద్ధరామయ్య ఒకే చెప్పినా డీకే మాత్రం నో అనడమే కాంగ్రెస్ పెద్దలకు షాకింగ్ గా మారింది.
మొత్తానికి డీకే ఇదే తీరున వ్యవహరిస్తే మాత్రం కాంగ్రెస్ ఒక కఠిన నిర్ణయం తీసుకుని సిద్ధరామయ్యకే సీఎం పగ్గాలు అప్పగిస్తుంది అని అంటున్నారు. ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యేలతో పాటు కర్నాటక ప్రజలు కూడా సిద్ధరామయ్యకే కోరుకుంటున్నారు. మరి పంతానికి పోయి మలి విడతలో సీఎం చాన్స్ ని డీకే వదులుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది.









