AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘కొడుక్కి భారమయ్యాం.. ఇక బతకలేం’..

మాటలకందని విషాదం
అసలే పేదరికం.. ఆపై అనారోగ్య సమస్యలు.. కొడుకు ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. దీంతో ఇక జీవించి లాభం లేదని ప్రాణాలు తీసుకున్నారు వృద్ధ దంపతులు. కుమారుడికి భారం కాకూడదని పురుగుల మందు తాగి తనువు చాలించారు. ఈ విషాదకర ఘటన నల్గొండ జిల్లా శాలి గౌరారం మండలం అడ్లూరు గ్రామంలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిలుకూరి నర్సయ్య(75), లక్ష్మమ్మ(70) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. అందరికీ పెళ్లిల్లు జరిపించాడు. అయితే నర్సయ్య గత నాలుగేళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. భార్య లక్ష్మమ్మ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతుండగా.. నిత్యం డయాలసిస్ చేయిస్తున్నారు.

కుమారుడు హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ భార్య పిల్లలతో అక్కడే నివాసం ఉంటున్నాడు. అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్తుండేవాడు. గ్రామంలో దంపతులు ఇద్దరూ ఒంటరిగా ఉంటున్నారు. అయితే తమ అనారోగ్య సమస్యలతో కుమారుడికి భారంగా మారామని వృద్ధ దంపతులు నిత్యం బాధపడుతుండేవారు. తాము హైదరాబాద్ వెళ్లలేమని.., కుమారుడుని ఇక్కడ ఉండమని చెప్పలేమని బంధువుల వద్ద వాపోయేవారు. తమ కుమారుడి ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమేనని మదనపడేవారు.

ఈ క్రమంలో కుమారుడికి భారం కాకూడదని దంపతులిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి పురుగుల మందు తాగారు. తెల్లవారినా.. ఇంటి తలుపులు తెరవకపోవడంతో చుట్టుపక్కల వారు, బంధువులు వెళ్లి చూశారు. అప్పటికే మృతి చెందిన దంపతులు విగత జీవులుగా కనిపించారు. వెంటనే వారి కుమారుడు, కుమార్తెలకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న వారు.. రోధనల మధ్య తల్లిదండ్రుల అంత్యక్రియలు పూర్తి చేశారు.

ANN TOP 10