బంగారు గనుల్లో అగ్ని ప్రమాదం సంభవించి 27 మంది సజీవదహనమైన ఘటన పెరూలో చోటుచేసుకుంది. దక్షిణ పెరులోని జరిగిన ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. ఇటీవల పెరూలో జరిగిన ఘోరమైన మైనింగ్ దుర్ఘటనలో ఇదీ ఒకటి. ప్రమాదం గురించి తెలిసిన వెంటే తమవారి ఆచూకీ కోసం పెద్ద సంఖ్యలో బాధితులు అక్కడకు చేరుకున్నారు. ‘షార్ట్ సర్క్యూట్ జరిగిందని, దాని కారణంగా పేలుడు సంభవించిందని మాకు తెలుసు.. జరిగినదంతా చూసి మేము చాలా షాక్ అయ్యాం’ అని బాధితుడి సోదరుడు ఒకరు వ్యాఖ్యానించారు.
యెకేపా ప్రాంతంలోని లా ఎస్పెరాంజా గని -1లోని సొరంగంలో మంటలు చెలరేగాయని, దీనికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ధ్రువీకరించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జియోవన్నీ మాటోస్ ఛానెల్ ఎన్ టెలివిజన్‌తో మాట్లాడుతూ.. గని ప్రమాదంలో 27 మంది చనిపోయారని చెప్పారు. మారుమూల ప్రావిన్సులు కొండేసుయోస్‌లోని బంగారు గనులలో ప్రమాదం సంభవించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. పేలుడు ధాటికి యానాక్విహువా పట్టణంలోని గనిలోని చెక్క సపోర్టులకు మంటలు అంటుకున్నాయని, బాధితులు భూమికి 100 మీటర్ల దిగువన ఉన్నారని తెలిపింది. ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల వివరాల గురించి సమాచారం సేకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.









