తెలంగాణలో కాంగ్రెస్ హస్తవాసి మారబోతుందా? టీకాంగ్రెస్ రూపురేఖలు మారనున్నాయా? చేయి గుర్తుకు మంచిరోజులు వచ్చాయా? ఇన్నాళ్లు చేతులు కలపకుండా కొట్లాడిన పార్టీ నేతలు ఏకతాటిపైకి రానున్నారా? ఈ సందేహాలన్నింటికీ సమాధానం ఒక్కటే.. ప్రియాంక గాంధీ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాలుగు దశాబ్దాల పాటు ప్రజలకు సుపరిపాలన అందించింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పలు కార్యక్రమాలు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి గురించి గ్రామాల్లో ఆరాతీస్తే.. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ కే జై కొడతారు.ఎందరో నిరుపేదలకు ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నిరాధారులను ఆదుకుంది. రైతుల కోసం కాంగ్రెస్ చేసిన సంక్షేమ కార్యక్రమాలెన్నో ఉన్నాయి. అయితే అలాంటి సమయంలో వచ్చిన తెలంగాణ ఉద్యమం తెలంగాణలో కాంగ్రెస్ స్థితిగతులను మార్చిందనే చెప్పాలి.
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి దూరమయ్యామని, వెనుకబాటుకు గురవుతున్నామని.. నీళ్లు,నిధులు, నియామకాలు అనే నినాదంతో ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని తలపెట్టారు కేసీఆర్. 2001, ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. 1956 నుంచి తెలంగాణ సాధన కోసం ఉద్యమాలు జరిగినప్పటికీ.. కేసీఆర్ ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ తో అవి తీవ్ర రూపం దాల్చాయి. 2009, నవంబర్ 29న దీక్షా దివస్ పేరుతో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షతో ఉద్యమం మరింత ఉగ్రరూపం దాల్చింది. తర్వాత ఎట్టకేలకూ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించింది అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని కాంగ్రెస్.
ఉద్యమ సమయంలో పదవుల కోసం ఆలోచించకుండా, ప్రజల కోసమని ఎందరో కాంగ్రెస్ లీడర్లు రాజీనామా చేసి ఉద్యమానికి మద్ధతిచ్చారు. సుదీర్ఘ కాలం పాటు సాగిన ఉద్యమం.. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిచడంతో ముగిసింది. అప్పటి నుంచి ప్రత్యేక తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది కాంగ్రెస్ పార్టీ. 2014లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటు కాగా.. తొలుత పార్టీ అధ్యక్షులుగా పొన్నాల లక్ష్మయ్య నియమితులయ్యారు. అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరాభవం చవిచూసింది. ఆ తర్వాత ప్రస్తుత ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధ్యక్షులుగా వ్యవహరించారు. 2020 లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి కారణంగా ఉత్తమ్ నౌతిక బాధ్యత వహించి .. అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పుడు రేవంత్ రెడ్డిని టీపీసీసీ ఛీఫ్ ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. రేవంత్ నియామకంతో కాంగ్రెస్ లో తీవ్ర అసమ్మతి రాగం ఏర్పడింది.
2020 లో కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై ఎందరో సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు.కానీ రేవంత్ రెడ్డిని ఛీఫ్ గా నియమించడంతో.. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, ఇతర సీనియర్ లీడర్లు బహిరంగంగా అసంతృప్తిని వెల్లగక్కారు. మొన్నమొన్నటి వరకూ వెంకట్ రెడ్డి రేవంత్ కు వ్యతిరేకంగానే వ్యవహరించారు. దాంతో టీకప్పులో తుఫాను మాదిరి తయారైంది కాంగ్రెస్ పరిస్థితి.ఇది ఇలాగే కొనసాగితే పార్టీకి కోలుకోలేని దెబ్బ పడటం ఖాయం. ఆ ఆలోచనతోనే తెలంగాణపై ఫోకస్ చేసింది అధిష్టానం.ఎన్నికలు సమీపిస్తుండటంతో.. అందరిని ఏకతాటిపైకి తీసుకురావాలి, తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణకు వస్తున్నారు.
తొలిసారి తెలంగాణకు వస్తున్న ప్రియాంక గాంధీ.. పార్టీ అంతర్గత అంశాలపై యాక్షన్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. సీనియర్ల నుంచి పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా.. ఎవరూ అసంతృప్తికి లోనవకుండా ఉండేలా ప్రియాంక చర్యలు చొరవ తీసుకోనున్నారు. మరోవైపు యూత్ ను ఆకర్షించేలా మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేసింది కాంగ్రెస్.
తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది పేపర్ లీక్ సమస్య. పేపర్ లీక్ కంటే.. నిరుద్యోగం రాష్ట్ర యువతను వెంటాడుతున్న ప్రధాన సమస్య అని చెప్పుకోవాలి. తెలంగాణ ఏర్పడినప్పుడు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో.. ఇప్పుడు కూడా అన్నీ పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయకుండా..నిరుద్యోగ భృతి ఇవ్వకుండా తీవ్ర నిర్లక్ష్యం చేసింది. చివరకు గతేడాది పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చింది. దాంతో నిరుద్యుగులు పరీక్షలకు సిద్ధపడ్డారు. తీరా పరీక్షలు దగ్గర పడ్డాక పేపర్ లీక్ అవడం కలకలం రేపింది.
పేపర్ లీక్ ఘటనతో తీవ్ర నిరాశ,నిసృహలో ఉన్న యువతకు అండగా నిలవాలని భావించింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా ప్రత్యేక కార్యాచరణతో నాలుగు జిల్లాల్లో నిరుద్యోగ నిరసన సభలు నిర్వహించింది. అంతేకాకుండా సరూర్ నగర్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు.ఈ సభ ద్వారా ఆమె యువతకు భరోసా కల్పించనున్నారు. తామున్నామనే ధైర్యం ఇవ్వనున్నారు.
ప్రియాంక గాంధీ యువసంఘర్షణ సభలో యూత్ డిక్లరేషన్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. యువతను ఆకర్షించేలా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ డిక్లరేషన్‌ను తయారు చేసింది. అధికారంలోకి వస్తే ప్రతి నెల రూ. 3501 నిరుద్యోగ భృతి హామీని ఇందులో పొందుపర్చినట్లు తెలిసింది. ప్రత్యేక విధి, విధానాలను తీసుకువచ్చి నిరుద్యోగులకు నష్టం జరగకుండా చూడాలనేదే కాంగ్రెస్ లక్ష్యమని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని యువత, నిరుద్యోగులను కాంగ్రెస్ కు మరింత దగ్గర చేసే అవకాశముందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
యూత్ డిక్లరేషన్ మాత్రమే కాకుండా.. రాష్ట్రంలోని ఇతర సమస్యలపై సైతం ప్రియాంక గాంధీ చొరవ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. 33 జిల్లాల్లో మౌళిక సదుపాయాల కల్పన,వ్యవసాయం, రైతులకు భరోసా, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, ఇతర అంశాలపై కూడా ప్రియాంక గాంధీ ఫోకస్ చేయనున్నారు.
వరంగల్ లోని రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ను క్రోడీకరిస్తే కాంగ్రెస్ కు మేలు జరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రూ.2 లక్షల రుణ మాఫీ, కౌలు రైతులకూ ఏడాదికి రూ.15వేల పెట్టుబడి సాయం, ఉపాధి హామీలో నమోదు చేసుకున్న రైతు కూలీలకు రూ.12వేల ఆర్థిక సాయం వంటివి ఇంప్లిమెంట్ చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. మద్ధతు ధర, తెలంగాణలో మూతపడిన చెరుకు కర్మాగారాలను తెరిపించడం, పసుపు బోర్డు ఏర్పాటు, ఉపాధి హామీ, ధరణి పోర్టల్ రద్దు, ‘రైతు కమిషన్’ ఏర్పాటుపై ప్రియాంక వివరించనున్నారు.ఈ అంశాలను జనాల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ప్రియాంక పార్టీ నేతలకు సూచించనున్నట్లు తెలిసింది.
ఇక రాష్ట్ర ప్రజలను ఆకట్టుకోవడం, భరోసా కల్పించడంతో పాటు… జిల్లాల్లో రాజకీయాలపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. తమ సత్తా చూపించాలని.. బీఆర్ఎస్ ను గద్దె దించాలని నిర్ణయించుకున్న కాంగ్రెస్.. ఆ దిశగా అడుగులు వేస్తుంది. జిల్లాల్లో బలమైన నాయకులపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే ఆదిలాబాద్ నాయకులు, కేఎస్సార్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాస రెడ్డితో రాహుల్ టీం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కాంగ్రెస్ లో చేరేందుకు కంది శ్రీనివాస రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పార్టీలో ప్రాధాన్యం కల్పిస్తామని, ఆదిలాబాద్ అసెంబ్లీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ఆయనకు హామీ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ఆహ్వానంతో సుదీర్ఘ మంతనాలు, సమాలోచనలు చేసి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్ కీలక నేతలైన మాజీమంత్రి రాంచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ తో కూడా సమావేశమై కాంగ్రెస్ లో చేరేందుకు డిసైడ్ అయ్యారు. ఇక రేపటి ప్రియాంక గాంధీ యువ సంఘర్షణ సభలో యువనేత కంది శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.









