కర్ణాటక ఎన్నికలు ముగియనుండటం, తెలంగాణలో ఎన్నికలకు మరో ఆరు నెలలు మాత్రమే వ్యవధి ఉండటంతో బీజేపీ అధినాయకత్వం స్పీడ్ పెంచుతోంది. కర్ణాటక ఎన్నికలు ముగింపు దశకు చేరుకోవడంతో తెలంగాణపై ఫోకస్ పెట్టింది. సోమవారంతో కర్ణాటక ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో ఈ నెల నుంచి తెలంగాణ బీజేపీపై పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టనుంది. పార్టీని బలోపేతం చేయడం కోసం అగ్రనేతలు రాష్ట్ర పర్యటనకు వచ్చేందుకు సిద్దవుతున్నారు.
ఈ క్రమంలో త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు ప్రారంభానికి మోదీ ఈ నెలలో రానున్నారని సమాచారం. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ నెలలోనే రాష్ట్ర పర్యటనకు రానున్నారని కాషాయ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా ఈ నెల చివరివారంలో లేదా వచ్చే నెల తొలివారంలో రాష్ట్ర పర్యటనకు రానుండగా.. త్వరలో జేపీ నడ్డా పర్యటన ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో జేపీ నడ్డా పర్యటిస్తారనే ప్రచారం సాగుతోంది.









